భారతీయ జనతా పార్టీకి అధికారం ఎక్కువైపోయి …గతంలో కాంగ్రెస్‌కు వచ్చిన సమస్యలు వెంటాడుతున్నాయి. ముఖ్యమంత్రుల స్థానంలో ఉన్న వాళ్లు పరిపాలనలో మెప్పించకపోవడం.. వివాదాస్పదంగా మారి… వారే మరోసారి గెలవడానికి మైనస్‌గా మారడం.. పార్టీని ధిక్కరించడం వంటి కారణాలతో.. గతంలో కాంగ్రెస్ పార్టీ సీఎంలను మార్చేస్తూ ఉండేది. తాజాగా.. దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారలో ఉన్న బీజేపీకి అలాంటి పరిస్థితే కనిపిస్తోంది. ఇటీవలే ఉత్తరాఖండ్ సీఎంను మార్చేసింది. అసోంలో రెండో సారి గెల్చినా సిట్టింగ్ సీఎంను కాదని మరొకరికి పీఠం కట్టబెట్టింది. తాజాగా… ఆ పార్టీ హైకమాండ్ మరో రెండు రాష్ట్రాలపై దృష్టి పెట్టింది. ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల ముఖ్యమంత్రులను తొలగించాలన్న కసరత్తు చేస్తోంది.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్… ముందు నుంచి మోడీ కన్నా తానే ఎక్కువ అన్న ఫీలింగ్‌లో ఉంటారు. పార్టీ హైకమాండ్ చెప్పిందేమీ చేయరు. అంతా తన సొంత పెత్తనమే చేస్తూంటారు. ఆయనకు ఆరెస్సెస్ అండ ఉండటంతో ఇంతకాలం సాగింది. ఆయనను సాగనంపాలని మోడీ, అమిత్ షా చాలా కాలంగా ప్రణాళికలు వేస్తున్నారని చెబుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా.. ఇతర పార్టీల నుంచి కీలక నేతల్ని చేర్చుకుంటున్న బీజేపీ హైకమాండ్.. మెల్లగా.. యోగి వ్యతిరేకుల్ని ప్రొత్సహించడం ప్రారంభించింది. ఇటీవల యోగికి వ్యతిరేకంగా అసమ్మతి పెరిగిపోవడంతో… పార్టీ నాయకత్వం మార్పు గురించి చర్చించడం ప్రారంభించింది. పరిశీలకులు కూడా ఢిల్లీకి వెళ్లి వచ్చారు.
పరిస్థితి దిగజారిపోతోందనే భావనకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి పెద్దలతో సమావేశం అవుతున్నారు. గురువారం.. అమిత్ షాతో సమావేశం అయ్యారు. శుక్రవారం.. ప్రధాని మోడీతో భేటీ కాబోతున్నారు. ఈ రెండు భేటీల తర్వాత యోగి ఆదిత్యనాథ్ సీఎం పీఠంపై క్లారిటీవచ్చే అవకాశం ఉంది. వచ్చే ఏడాది మొదట్లో యూపీకి ఎన్నికలు జరగనున్నాయి. ఇవి అత్యంత కీలకం కావడంతో గట్టి నిర్ణయమే తీసుకోవాలన్న ఆలోచనలో మోడీ షా ఉన్నట్లుగా తెలుస్తోంది.
మరో వైపు కర్ణాటకలో ప్రభుత్వ పనితీరుపై హైకమాండ్ ఆగ్రహంగా ఉంది. ఓ వైపు పార్టీ నేతలు వివాదాలు ఇరుక్కుంటున్నా సరిగ్గా డీల్ చేయలేకపోవడం… మరో వైపు..ప్రభుత్వ నాసికరమైన పనితీరుతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతూండటంతో యడ్యూరప్పను తప్పించాలని హైకమాండ్ నిర్ణయించింది. ఇందులో భాగంగానే… అక్కడ కూడా హైకమాండ్ ప్రేరేపిత అసంతృప్తి బయటపడుతోంది. త్వరలో ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులను బీజేపీ మార్చే చాన్స్ ఎక్కువగా ఉందంటున్నారు.