జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులతో పాటు హోంమంత్రి అమిత్ షాను కలిశారు. నిజానికి అమిత్ షా అపాయింట్మెంట్ దొరక్కపోతే.. ఆయన ఢిల్లీ వెళ్లేవారు కాదు. ప్రధానమంత్రి మోడీ అపాయింట్మెంట్ కోసం ఆయన ప్రయత్నిస్తున్నారో లేదో కానీ.. ఏ సమస్య వచ్చిన ఆయన అమిత్ షానే కలుస్తున్నారు. రోజుల తరబడి వెయిట్ చేసి మరీ ఆయన కోసం వెళ్తున్నారు. ఆయనకే.. అన్ని రకాల సమస్యలనూ నివేదిస్తున్నారు. పోలవరం నిధుల దగ్గర్నుంచి మూడు రాజధానుల వరకు అన్ని సమస్యలనూ ఆయనకే నివేదిస్తున్నారు. నిజానికి అమిత్ షా హోంమంత్రి మాత్రమే. ఆయన శాఖకు సంబంధించిన అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్తే చాలు.
కానీ జగన్ మాత్రం… పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అంతకు ముందే కేంద్రమంత్రి గజేంద్ర షెకావత్‌కు వినతిపత్రం సమర్పించినప్పటికీ.. మళ్లీ అమిత్ షాకు నిధుల గురించి విజ్ఞప్తి చేశారు. విభజన సమస్యలు.. విద్యుత్ సమస్యలు.. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు సహా అన్నింటిపైనా విజ్ఞప్తి చేసినట్లుగా అధికారవర్గాలు ప్రకటించాయి. దీంతో సహజంగానే విపక్షాలు… ఆర్థిక విషయాలపై అమిత్ షాకు ఎలా.. విజ్ఞప్తి చేస్తారని ప్రశ్నించడం ప్రారంభించాయి. అమిత్ షాతో జరిగే చర్చల్లో జగన్ కేవలం తన వ్యక్తిగత విషయాలు మాత్రమే చర్చిస్తారని ..బయటకు మాత్రం.. అన్నీ చేస్తున్నట్లుగా చెబుతారని విమర్శిస్తూంటాయి.
అయితే నిజంగానే అమిత్ షాకు..జగన్ అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. ప్రధాని మోడీ కూడా… అమిత్ షా చెప్పినట్లుగా చేస్తారని అందుకే..ప్రధానికి చెప్పుకోవడం కన్నా అమిత్ షాకు చెప్పుకోవడమే మంచి ఫలితాలను ఇస్తుందన్న నమ్మకానికి జగన్ వచ్చినట్లుగా చెబుతున్నారు. గతంలో రెండు, మూడు సార్లు ప్రధానిని కలిసినప్పుడు… మోడీ కూడా.. అమిత్ షాను కలవాల్సిందిగా సూచించారు. ఈ క్రమంలో జగన్‌కు మరింత గురి కుదిరింది. అమిత్ షాకు అన్ని రకాల సమస్యలు చెప్పుకునేందుకే జగన్ ప్రధాన్యత ఇస్తున్నారు.