‘క్రాక్’తో సూపర్ హిట్టు కొట్టాడు గోపీచంద్ మలినేని. ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేసే అవకాశాన్ని అందుకున్నాడు. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. స్క్రిప్టు పూర్తయ్యింది. ప్రస్తుతం నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికలో బిజీగా ఉన్నాడు గోపీచంద్ మలినేని.
ఈ సినిమా కోసం `క్రాక్` టీమ్ నే బాలయ్య రంగంలోకి దింపుతున్నట్టు సమాచారం. సంగీత దర్శకుడిగా తమన్‌ని ఎంచుకున్నాడు గోపీచంద్. సంభాషణ రచయితగా బుర్రా సాయిమాధవ్ పని చేస్తారని తెలుస్తోంది. అంతేకాదు… `క్రాక్`లో విజృంభించిన వరలక్ష్మీ శరత్ కుమార్ కి ఓ శక్తిమంతమైన పాత్ర అప్పగించాడు. ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పనిచేయనున్నారు. వీళ్లంతా క్రాక్ నుంచి వచ్చినవాళ్లే. కథానాయికగానూ… శ్రుతిహాసన్ నే ఎంపిక చేశారని వార్తలొచ్చాయి. అయితే.. ఈ సినిమా కోసం శ్రుతిని ఇంత వరకూ సంప్రదించలేదని టాక్. త్రిష ని ఎంచుకున్నారన్న వార్తల్లోనూ నిజం లేదు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండడం మాత్రం ఖాయం. ఆల్రెడీ ఓ కథానాయికని ఎంపిక చేసేశారు కూడా. అయితే.. ఆమె పేరుని అతి త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు.