సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ తీరు ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. ఆయన న్యాయవ్యవస్థపై ఎదురుదాడి చేయడానికి జగన్‌కు సహకరిస్తున్నారని.. లేఖలు అన్నీ ఆయనే తయారు చేస్తున్నారన్న విపక్ష పార్టీలు ఆరోపిస్తున్న సమయంలో… ఆయన కుమారుడు… ఏపీ ప్రభుత్వం నుంచి ఆయాచితంగా పెద్ద ఎత్తున సొమ్ములు పొందుతున్నారు. జాస్తి చలమేశ్వర్ కుమారుడు జాస్తి నాగభూషణం న్యాయవాది. పేరుకే న్యాయవాది. ఆయనేమైనా కేసులు వాదించారా.. వాటిల్లో ఏమైనా పేరు తెచ్చుకున్నారా అన్న విషయం ఎవరికీ తెలియదు. అయితే.. ఆయన్ని నేరుగా అడిషనల్ అడ్వకేట్ జనరల్‌గా నియమించిన ఏపీ సర్కార్… పెద్ద ఎత్తున నిబంధనలకు విరుద్ధంగా ఆర్థికంగా ప్రయోజనాలు కల్పిస్తోంది.
నాలుగైదు రకాల జీవోలు జారీ చేసి.. అడిషనల్ అడ్వకేట్ జనరల్స్‌కు పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి ఆదేశాలు జారీ చేస్తోంది. ఈక్రమంలో జాస్తి చలమేశ్వర్ కుమరుడుకి నెలకు రూ. పది లక్షల వరకూ ప్రజాధనం కట్టబెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐదు నెలల్లో రూ. యాభై లక్షలు.. ఆయన ఖాతాకు ప్రజాధానం వెళ్లిందని అంటున్నాయి. నిజానికి ప్రభుత్వం కీలకమైన కేసులన్నింటినీ పెద్ద ఎత్తున బయట లాయర్లను నియమించుకుంటోంది. వారికి లక్షలు లక్షలు బిల్లులు చెల్లిస్తోంది. వారితో పాటు ఎలాంటి వాదనలు వినిపించని… కోర్టు ముందుకు హాజరు కాని జాస్తి నాగభూషణం లాంటి వారికి కూడా లక్షలకు లక్షలు చెల్లిస్తోంది. ఈ గూడుపుఠాణి ఏమిటో చెప్పాలని .., టీడీపీ నేతలు డిమాండ్ చేయడం ప్రారంభించారు.
జాస్తి చలమేశ్వర్ సుప్రీంకోర్టు న్యాయమర్తిగా పని చేసి రిటైరయ్యారు. ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న సమయంలో.. కొంత మంది న్యాయమూర్తులు.. అప్పటి చీఫ్ జస్టిస్‌కు వ్యతిరేకంగా ప్రెస్‌మీట్ పెట్టడం సంచలనం అయింది. ఆ తర్వాత ఆయన రిటైరయ్యారు. రిటైరైన తర్వాత జగన్మోహన్ రెడ్డి లా టీంలో కీలక పాత్ర పోషిస్తున్నారన్న ప్రచారం ఉంది. లా సర్కిల్స్‌లో ఆయన జోక్యంపై అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉంటూ ఉంటున్నాయి. ఇలాంటి తరుణంలో.. ఆయన చేస్తున్న సేవల కోసమే.. ఆయన కుమారుడికి పదవి ఇచ్చి.. ఆ పదవికి పెద్ద ఎత్తున ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నారని అంటున్నారు.
ఇప్పటికి ఇది వారికి ప్రభుత్వ అధికారాల మేరకు చేస్తున్నామని అనిపించవచ్చు కానీ… అసలు ఈ వ్యవహారంపై విచారణ జరిగితే.. మొత్తం గుట్టు బయటపడే అవకాశం ఉంది. ఏకంగా న్యాయవ్యవస్థపై దాడి చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సహకరించడం ఒకటి అయితే.. దానికి ప్రతిఫలంగా ప్రజాధనాన్ని పాలకులు… అడ్డదారిలో దోచి పెట్టడం.. మరో తప్పిదమని… టీడీపీ సహా ఇతర పక్షాలు ఆరోపిస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణిగే అవకాశం కనిపించడం లేదు.