కరోనా ఔషధాలపై జీఎస్టీ ఏంటంటూ దేశం మొత్తం భగ్గుమంది. సెకండ్ వేవ్ ప్రజల ప్రాణాలను పిట్టల్లా రాల్చేస్తూంటే.. ప్రాణాలు కాపాడుకునేందుకు కొనుక్కున్న ఆక్సిజన్ దగ్గర్నుంచి వ్యాక్సిన్ వరకూ అన్నింటిపైనా జీఎస్టీ వసూలుచేయడం.. అదీ కూడా.. దాదాపుగా పద్దెనిమిది శాతం వసూలు చేయడం దుమారం రేపింది. అయితే… పన్నులు తగ్గించేందుకు కేంద్రం ఏ దశలోనూ సుముఖంగా లేదు. చివరికి పన్నులు తగ్గిస్తే.. రేట్లు పెరుగుతాయంటూ వితండ వాదన చేసిన నిర్మలా సీతారామన్.. ట్రోలింగ్‌కు గురయ్యారు. అయితే.. ఇప్పుడు మాత్రం మనసు మార్చుకున్నారు. కరోనా ఔషధాలపై జీఎస్టీ తగ్గిస్తూ.. తాజాగా జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే ఔషధాలపై జీఎస్టీ ఐదు శాతంగా ఉంటే పూర్తిగా రద్దు చేశారు. రెమిడెసివర్ లాంటి ఇతర కరోనా ఔషధాలపై పన్నెండు నుంచి పద్దెనిమిది శాతం వరకూ ఉన్న జీఎస్టీని ఐదు శాతానికి తగ్గించారు. మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్‌పై కూడా ఇంతకు ముందు 12 శాతం జీఎస్టీఉండేది దాన్ని 5 శాతానికి తగ్గించారు. ఆక్సిజన్ కాన్సన్ ట్రేటర్లు.. వెంటిలేటర్లు.. వంటి వాటిపైనా ఐదు శాతమే పన్ను విధించాలని నిర్ణయించారు. టెస్టింగ్ కిట్లపైనా కాస్తంత దయ చూపారు. విశేషం ఏమిటంటే అంబులెన్స్ సేవలపై గతంలో ఇరవై ఎనిమిది శాతం జీఎస్టీ ఉండేది ఇప్పుడు పది శాతం వరకూ తగ్గించారు.
నిజానికి ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ పూర్తిగా సద్దుమణిగిపోతోంది. ఆస్పత్రులు ఖాళీ అయ్యాయి. ఇలాంటి సమయంలో.. పన్నుల తగ్గింపు నిర్ణయం తీసుకున్నారు. పోనీ ఈ నిర్ణయం శాశ్వతంగా ఉంచారా అంటే అదీ లేదు. కొత్తగా నిర్ణయించిన ఈ పన్ను రేట్లు ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు అందుబాటులో ఉంటాయని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అంటే… మళ్లీ ధర్డ్ వేవ్ అంటూ వస్తే.. ఆ సమయానికి యధావిధిగా… పన్నుల రేట్లు ఉంటాయన్నమాట.