సంక్షేమ పథకాలకు నిధులు… అప్పుల తిరిగి చెల్లింపుల వాయిదాలకు నిధులు అవసరం పెరిగే కొద్దీ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో నిధుల కోసం.. ఆస్తుల అమ్మకాలు… తాకట్టు పెట్టడం వంటివి చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో అత్యంత విలువైన స్థలాలు.. ఆస్తులు విశాఖలోనే ఉన్నాయని… అక్కడే దృష్టి కేంద్రీకరించారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని ప్రచారం చేస్తూ… అక్కడి కలెక్టరేట్ సహా మొత్తం తాకట్టు పెట్టడానికి సిద్ధమయ్యారు. చివరికి… అద్దె భవనాలను సైతం తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దేవాదాయ స్థలంలో ఉంటూ.. నెలవారీగా అద్దెలు కడుతున్న ఓ ఎమ్మార్వో ఆఫీసును కూడా తాకట్టు జాబితాలోకి చేర్చడమే దీనికి కారణం.
ప్రభుత్వ విన్యాసాలు ఇప్పుడు విశాఖ వాసుల్లో తీవ్రంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్నదేంటి.. చేస్తున్నదేమిటి.. అన్న చర్చ జరుగుతోంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ఏ ప్రభుత్వం వచ్చినా… ప్రజాఆస్తుల్ని… కాపాడే బాధ్యతను తీసుకుంది. ఎక్కడైనాఆస్తుల్ని అమ్మాలంటే.. ముందుగా సంపద సృష్టించి.. ఆ సంపదను కొంత మేర అమ్మి ప్రజల అవసరాలకుఖర్చు పెట్టారు. అంతే కానీ… రైతు బజార్లు… ఉద్యోగుల క్వార్టర్లు.. ఎమ్మార్వో ఆఫీసులు.. కలెక్టరేట్ల భవనాలను తాకట్టు పెట్టాలనే ఆలోచన ఎప్పుడూ చేయలేదు. కానీ జగన్ సర్కార్ మాత్రం రేపు లేదన్నట్లుగా మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులన్నింటికీ… అమ్మడమో.. తనఖా పెట్టడమో చేయాలన్నంత దూకుడుగా ఉంది.
అన్ని ఆస్తులు అయిపోయిన తరవాత ఇక కాలనీలను కూడా తాకట్టు పెట్టడం ప్రారంభిస్తారేమోనని.. దాని కోసం చట్టం చేస్తారేమోనన్న చర్చలు విశాఖ ప్రజల్లో జరుగుతున్నాయి. ఇదేలా సాధ్యమని కొంత మంది అనుకుంటున్నారు. కానీ.. ఏపీ సర్కార్ గత రెండేళ్లలో చేసిన పనులన్నీ ఇదెలాసాధ్యమని అనుకున్నవే. అవి కోర్టుల్లో పడి ఆగిపోయినా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమ్మకానికి పెట్టిన ఆస్తుల జాబితా చూసే చాలా మంది విశాఖ వాసుల మైండ్ బ్లాంక్ అయింది. ఇప్పుడు.. తాకట్టుకు సిద్ధమైన ఆస్తుల జాబితా చూసి రగిలిపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కేసులు.. దాడుల భయంతో చాలా మంది నోరు తెరవలేకపోతున్నారు కానీ.. ఒక్క సారి జనం తిరగబడితే.. ఆపడం ఎవరి తరం కాదంటున్నారు.