ఓట్ల కోసం దేశ ద్రోహులకు మద్దతివ్వడం, వాళ్లమీద చర్యలు తీసుకునే ప్రభుత్వాన్ని తిట్టడం అనే ఓటు బ్యాంకు రాజకీయాలు బహుశా ప్రపంచం మొత్తం మీద భారత్ లో తప్ప ఇంకెక్కా కనిపించవేమో. ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి, పాకిస్తాన్ కు జై కొట్టిన ఉగ్రవాద అనుకూల విద్యార్థులపై చర్య తీసుకోవడం నేరమా? అది దేశ ద్రోహమా? అవుననే అంటున్నారు రాహుల్ గాంధీ. కాశ్మీర్ కు విముక్తి కలిగే వరకూ విశ్రమించేది లేదనే నినాదాలు జాతికి అనుకూలమా? వ్యతిరేకమా? అఫ్జల్ గురు అనే టెర్రరిస్టును అమర వీరుడని పొడగటం దేశ భక్తా? దేశ ద్రోహమా? ఇలాంటి కార్యక్రమానికి, దేశ ద్రోహుల నినాదాలకు కారకుడైన విద్యార్థి సంఘం అధ్యక్షుడిని పోలీసులు అరెస్టు చేయడం దేశ ద్రోహమా? అవును వాళ్లే దేశ ద్రోహులంటూ విద్యార్థుల హర్షధ్వానాల మధ్య రాహుల్ గాంధీ సూత్రికరించారు. దేశ ద్రోహానికి పాల్పడిన విద్యార్థులకు మద్దతుగా, వాళ్లకు ఇబ్బంది కలుగుతుందేమో అనే ఆందోళనతో వామపక్షాలకు చెందిన పెద్ద నాయకులుగా కూడా రంగంలోకి దిగారు. విద్యార్థులకు మద్దతు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మోడీమీద వామపక్షాలకు కోపం ఉండొచ్చు. సిద్ధాంతాలు వేరు కావచ్చు. అఫ్జల్ గురును అమర వీరుడని, కాశ్మీర్ విముక్తం కావాలని, పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు చేయడాన్ని వామపక్షాలు సమర్థిస్తాయా? అమెరికాలో ఒసామా బిన్ లాడెన్ ను లేదా అల్ ఖైదాకు చెందిన మరో ఉగ్రవాదిని పొగుడుతూ నినాదాలు చేయడం ఊహించగలమా? అలా చేస్తే తాటతీస్తారు. పోలీసులు వచ్చేలోగా అక్కడి పౌరులే తీవ్రంగా స్పందిస్తారు. పారిస్ లో ఐసిస్ ఉగ్రవాదులను పొగుడుతూ నినాదాలు కాదుగదా, కనీసం పల్లెత్తు మాటైనా అనడం ఊహించగలమా? అదే జరిగితే అక్కడి ప్రజలు ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. ఉగ్రవాద దాడుల అనర్థాన్ని చవిచూసిన ఆ దేశాల్లో టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడటం ఊహించలేం. ఒకవేళ టెర్ర రిస్టు సానుభూతిపరులైనా బహిరంగంగా మాట్లాడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఉగ్రవాదం మానవత్వానికి వ్యతిరేకం. త్వరలో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో కేరళ, అస్సాంలలో అధికారాన్ని నిలబెట్టుకోవడం కాంగ్రెస్ పార్టీకి ముఖ్యం. బెంగాల్ ఎన్నికల్లో ఈసారైనా గెలవడం వామపక్షాలకు ముఖ్యం. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ముస్లింలు గణనీయ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి అఫ్జల్ గురును సమర్థించే దేశద్రోహులైనా సరే, ఆ విద్యార్థులకు అండగా నిలబడి ఒక వర్గం వారి సానుభూతి పొందాలనేది వీరి ఎత్తుగడా? నిజమైన ముస్లింలు ఉగ్రవాదులను సమర్థిస్తారని ఎవరు చెప్పారు? ఎవరైనా ఆ మాట అంటే అది ముస్లింలను అవమానించడమే. పఠాన్ కోట్ దాడి తర్వాత దేశంలోని అనేక నగరాల్లో ముస్లింలు నిరసన ప్రదర్శనలు చేశారు. ఉగ్రవాదం ఇస్లాంకు వ్యతిరేకమని నినదించారు. అయినా, ఓటు బ్యాంకు వేటలో ఉన్న కొన్ని పార్టీలకు ఈ విషయం అర్థం కావడం లేదు . ఓటు బ్యాంకు రాజకీయాలే ఈ దేశాన్ని తిరోగమన పథంలో నడిపిస్తున్నాయి. ఇండియాలో ఇంతే !!