ఆంధ్రప్రదేశ్ నుంచి గవర్నర్ కోటాలో నలుగురు ఎమ్మెల్సీల్ని ఎంపిక చేసినట్లుగా ఐదు రోజుల కిందట ప్రచారం జరిగింది. అప్పుడే గవర్నర్ ఆమోదం కోసం ఫైల్ పంపినట్లుగా ప్రభుత్వవర్గాలు చెప్పాయి. కానీ ఐదు రోజులైనా వాటికి అనుమతి రాలేదు. జాబితాలో పేరున్న నలుగురు ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ …గవర్నర్ మాత్రం సంతకం పెట్టలేదు. దీనిపై ప్రభుత్వం ఆరా తీస్తే.. ఇద్దరు అభ్యర్థులపై గవర్నర్ సుముఖంగా లేరని..వారి పేర్ల విషయంలో అదనపు సమాచారం తెప్పించుకుంటున్నారని తేలింది. దీంతో కంగారుపడిన ముఖ్యమంత్రి జగన్ నేరుగా గవర్నర్ను కలవాలని నిర్ణయించుకున్నారు. ఆ భేటీఈ రోజు జరగనుంది.
ఏపీ సర్కార్ నుంచి గవర్నర్కు వెళ్లిన నాలుగు పేర్లలో తోట త్రిమూర్తులు, లేళ్ల అప్పిరెడ్డి పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ వివాదాస్పద వ్యక్తులు. క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ సమాచారం ఎలా తెలిసిందో కానీ.. గవర్నర్ కార్యాలయం… వారిపై ఉన్న కేసుల గురించి అదనపు సమాచారం సేకరించినట్లుగా తెలుస్తోంది. తోట త్రిమూర్తులు శిరోముండనం కేసులో నిందితుడు. ఈ కేసుపై విచారణ జరుగుతోంది. లేళ్ల అప్పిరెడ్డి అనేక అసాంఘిక కార్యకలాపాలు సాగించే ముఠాలకు నాయకత్వం వహిస్తాడన్న ఆరోపణలు ఉన్నాయి. క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో వారిని గవర్నర్ కోటా కింద ఎంపిక చేసే విషయంలో బిశ్వభూషణ్ హరిచందన్ ఆలోచిస్తున్నట్లుగా చెబుతున్నారు.
నిజానికి బిశ్వభూషణ్.. ఎప్పుడూ.. ఏపీ సర్కార్ నుంచి వచ్చే ఫైళ్లను పెండింగ్ పెట్టడం లాంటివి చేయడం లేదు.రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు అని.. న్యాయనిపుణులు చెప్పినా కూడా… సంతకం పెట్టేసి పంపించిన రోజులు ఉన్నాయి. అవి కోర్టుల్లో వీగిపోయినా ఆయన లైట్ తీసుకున్నారు. అలాంటి ప్రో సాఫ్ట్ గవర్నర్ ఇప్పుడు.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ పంపిన పేర్లపై కొత్తగా పరిశీలన చేస్తున్నారన్న ప్రచారం బయటకు జరగడమే… కాస్త ఆశ్చర్యకరంగా కనిపిస్తోందని వైసీపీ వర్గాలు అంటున్నాయి. మారుతున్న రాజకీయ పరిస్థితులు కారణమా… లేక గవర్నర్ ఇప్పటి వరకూ తనపై వచ్చిన విమర్శలు చాలని.. ఇక జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారా.. అన్నది వైసీపీ వర్గాలకు అర్థం కావడం లేదు.
ముఖ్యమంత్రి జగన్ గవర్నర్ అభ్యంతరం వ్యక్తం చేశారని ఆ రెండు పేర్లను తొలగించి కొత్తవారికి చొటిచ్చేంత ఆలోచన చేయరు. ఆయన అనుకున్నారు అంటే గవర్నర్ అయినా ఆమోదించాల్సిందే. అందుకే.. స్వయంగా కలవడానికి వెళ్తున్నారు. చివరికి గవర్నర్ ఆ పేర్లను తప్పక ఆమోదిస్తారని…వైసీపీ వర్గాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి.