పవన్ కల్యాణ్ దాదాపుగా మూడేళ్ల సుదీర్ఘ విరామం తరవాత చేసిన సినిమా.. వకీల్ సాబ్. పవన్ స్క్రీన్ ప్రెజెన్స్, కోర్టు రూమ్ డ్రామా బాగా పండాయి. తొలి మూడు రోజుల వసూళ్లు కుమ్మేశాయి. ఇక వకీల్ సాబ్ రికార్డు వసూళ్లు గ్యారెంటీ అనుకుంటున్న దశలో.. కరోనా సెకండ్ వేవ్ బాక్సాఫీసుని ముంచేసింది. థియేటర్ల మూత వల్ల… వకీల్ సాబ్ జోరు అర్థాంతరంగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు వకీల్ సాబ్ ని మళ్లీ రీ – రిలీజ్ చేయాలని దిల్ రాజు భావిస్తున్నట్టు సమాచారం. త్వరలోనే థియేటర్లు మళ్లీ తెరచుకుంటాయన్న సంకేతాలు చిత్రసీమకు అందుతున్నాయి. తెలంగాణా, ఆంధ్రలలో ఈ నెలాఖరుకి లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేసే సూచనలు కనిపిస్తున్నాయి. జులై ద్వితీయార్థంలో థియేటర్లు తెరచుకోవొచ్చు. అప్పటికప్పుడు విడుదల చేయడానికి సినిమాలు సిద్ధంగా ఉండకపోవొచ్చు. అందుకే `వకీల్ సాబ్`ని రంగంలోకి దించి, మళ్లీ జనాలను థియేటర్లకు రప్పించాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నారు.
కనీసం 300 థియేటర్లలో అయినా, వకీల్ సాబ్ ని విడుదల చేయాలన్నది దిల్ రాజు ప్లాన్. 50 శాతం ఆక్యుపెన్సీతో పెద్ద సినిమాలు విడుదల చేయడానికి నిర్మాతలు ఆలోచిస్తారు. చిన్న సినిమాలు వచ్చినా, పెద్దగా ప్రభావం ఉండదు. ఈ గ్యాప్ ని వకీల్ సాబ్ తో ఫిల్ చేయాలన్నది దిల్ రాజు ఆలోచన. వకీల్ సాబ్ ఎడిటింగ్ రూమ్ లో పక్కన పెట్టిసిన కొన్ని సీన్లు కూడా కలిపి… ఈసారి కొత్త వెర్షన్ విడుదల చేస్తే ఎలా ఉంటుందా? అనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నార్ట. ఇప్పటికే అమేజాన్ లో వకీల్ సాబ్ వచ్చేసింది. థియేటర్లో చూడని వాళ్లు అందులో కవర్ చేసేశారు. కాకపోతే.. పవన్ ని వెండి తెరపై చూసే మజా వేరు కదా. అందుకే ఈ ఆలోచన. మరి ఈ ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో చూడాలి