దుబ్బాక ఉపఎన్నికల్లో గెలుపు.. గ్రేటర్లో ఒక్క సారిగా ఎదిగిపోవడం వంటి పరిణామాలతో బీజేపీకి వచ్చిన ఊపు తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు, సాగర్ , మినీ మున్సిపల్ ఎన్నికల్లో పరాజయంతో పూర్తిగా చప్పబడిపోయింది. ఇప్పుడు బీజేపీకి మరో చాన్స్ వచ్చింది. అదే హుజూరాబాద్ ఉపఎన్నిక. స్వయంగా కేసీఆరే.. ఈ చాన్స్ ఇస్తున్నారు. అంతర్గతంగా ఏం జరిగిందో కానీ.. ఈటలను ఆయన వద్దనుకున్నారు. తన పాత వ్యూహం ప్రకారం బయటకు పంపేశారు. ఆయన వెళ్లి బీజేపీలో చేరుతున్నారు. ఇంత దాకా వచ్చిన తర్వాత ఉపఎన్నికను ఎదుర్కోవడంలో కాస్త కూడా తడబడకూడదు కాబట్టి… రంగంలోకి కూడా దిగారు.
హుజూరాబాద్‌లో బీజేపీకి ఎప్పుడూ బలం లేదు. గత ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పదహారు వందల ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గంలో పాతుకుపోయిన ఈటల రాజేందర్ బీజేపీ తరపున బరిలోకి దిగుతున్నారు. కాబట్టి… బీజేపీ రేసులోకి వచ్చినట్లే. ఇక్కడ ఈటల ఓడిపోతే… ఈటలకు ఎంత నష్టం జరుగుతుందో.. బీజేపీకి అంత కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే… బీజేపీకే ఎక్కువ నష్టం జరుగుతుంది. ఈటల రాజేందర్ ఇండిపెండెంట్‌గా పోటీ చేసినట్లయితే.. అన్ని వర్గాల మద్దతు లభించేదని ఇప్పటికే కొంత మంది విశ్లేషణలు చేస్తున్నారు. కానీ ఆయన బీజేపీలో చేరడం వల్ల… చాలా మంది మద్దతును కోల్పోవాల్సి వస్తోందని అంటున్నారు. అంటే.. ఒక వేళ ఈటల కనుక ఓడిపోతే.. ఆ ఓటమి ఈటలది కాదని.. బీజేపీదనే ప్రచారం చేస్తారు. ఇది మరింత డ్యామేజ్ చేస్తుంది.
పడిపోయిన హైప్‌ను మళ్లీ పెంచుకోవాలన్నా… బీజేపీ వల్లనే ఈటల గెలిచారన్న పేరు రావాలన్నా.. ఖచ్చితంగా హుజూరాబాద్‌లో బీజేపీ గెలవాల్సి ఉంది. ప్రత్యేకంగా కేసీఆర్ కోరుకుంటే తప్ప.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు. మళ్లీ ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే అవకాశం లేదు. ఇతర ఏ ఎన్నికలు కూడా లేవు. బీజేపీ పుంజుకుంది అని నిరూపించుకోవడానికి ..కేసీఆర్.. అనాలోచితంగానో.. వ్యూహాత్మకంగానో ఇచ్చిన ఓ ఆఫర్‌గా ఉపఎన్నికను బీజేపీ భావించవచ్చు. అయితే.. కేసీఆర్‌ను ఢీకొట్టడం అంత తేలిక కాదు.. అది ఈటల కంచుకోటే అయినా.. అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజ్‌ను వంద శాతం వినియోగించుకోవడంలో కేసీఆర్ సిద్ధహస్తుడు. తిప్పికొట్టగలిగే శక్తి ఈటలకు.. ఇతర బీజేపీ నేతలకు ఉందా అన్నదే ఇక్కడ కీలకం.