ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో .. తొలి అడుగులోనే పెద్ద హిట్టు కొట్టాడు స్వరూప్. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా `మిషన్ ఇంపాజిబుల్`ని తెరకెక్కిస్తున్నాడు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇదో యాక్షన్ థ్రిల్లర్. `ఏజెంట్..`లానే ట్విస్టులతో నిండిపోతుందట. తిరుపతి నేపథ్యంలో సాగే కథ ఇది. ఆమధ్యెప్పుడో షూటింగ్ మొదలైంది. లాక్డౌన్ వల్ల ఆగిపోయింది. ఈసినిమాలోని ఓ కీలకమైన పాత్ర కోసం తాప్సిని తీసుకున్నారు. ఓ రకంగా.. తనే ఈ సినిమాలో హీరో అనుకోవాలి. తాప్పికి తెలుగులో కంటే… బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఉంది. దాన్ని వాడుకోవాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. పైగా తాప్సి తెలుగులో సినిమాలు చేయడానికి మరీ మొహమాటపడుతోంది. మంచి కథ అనుకుంటే తప్ప, ఒప్పుకోవడం లేదు. ఇటీవల తాప్సిని కలిసిన స్వరూప్… బౌండెడ్ స్క్రిప్టు చేతిలో పెట్టాడట. ఆ స్క్రిప్టు చదివి.. సినిమా ఓకే చేసేసింది. త్వరలోనే… `మిషన్ ఇంపాజిబుల్` కొత్త షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. ఆ షెడ్యూల్లోనే తాప్సి అడుగుపెట్టబోతోందని తెలుస్తోంది.