టాలీవుడ్ లో మళ్లీ `స్టార్.. కెమెరా.. యాక్షన్` అనే మాటలు వినపడబోతున్నాయి. సెట్లు మళ్లీ కళకళలాడబోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం కాస్త కాస్త తగ్గుతున్న వేళ, లాక్ డౌన్ నీడలు మెల్లమెల్లగా తొలగిపోతున్న వేళ… షూటింగులకు మళ్లీ రెడీ అవ్వబోతోంది టాలీవుడ్. జూలై నుంచి షూటింగులు మొదలవుతతాయని భావించారంతా. అయితే.. అంతకు ముందుగానే ఆ హడావుడి కనిపించబోతోంది. ఈనెలలోనే కొన్ని ప్రధానమైన సినిమాలు సెట్స్‌లోకి వెళ్లడానికి రెడీ అయ్యాయి. దాంతో.. టాలీవుడ్ లో కాస్త సందడి కనిపించబోతోంది.
నాగచైతన్య సినిమా `థ్యాంక్యూ` ఈనెల 21న కొత్త షెడ్యూల్ మొదలెట్టుకోనుంది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్లున్న సంగతి తెలిసిందే. ఈ యేడాది చివర్న గానీ, సంక్రాంతికి గానీ, ఈ చిత్రం విడుదలయ్యే ఛాన్సుంది. గుణశేఖర్ – సమంతల `శాకుంతలమ్` కూడా ఈనెలలోనే మొదలుకానుంది. ఈనెల 24న ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నారు. అందుకోసం హైదరాబాద్ లో భారీ సెట్ ని కూడా తీర్చిదిద్దారు. రవితేజ ఖిలాడీకి ఈనెల 26న క్లాప్ కొట్టబోతున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తవుతుంది. జులై 1న ఎఫ్ 3, `ఆర్.ఆర్.ఆర్`… రెండూ సెట్స్‌పైకి వెళ్లనున్నారు. అఖండ, ఆచార్యలు కూడా సెట్స్‌పైకి వెళ్లడానికి సమాయాత్తం అవుతున్నాయి. జులై మొదటి వారానికి… పెద్ద సినిమాలన్నీ షూటింగులు ప్రారంభించుకోవడానికి రెడీ అవుతాయి.