బిజెపి నేత విజయశాంతి, హరీష్ రావు ,కేసీఆర్ ల పై సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. తెలంగాణలో జరుగుతున్న భూముల అమ్మకం లో అక్రమాలు జరుగుతున్నాయంటూ టిఆర్ఎస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు విజయశాంతి. వివరాల్లోకి వెళితే..
విజయశాంతి సోషల్ మీడియా లో ట్వీట్ చేస్తూ, ” తెలంగాణ భూముల అమ్మకం పై ఆర్థికమంత్రి హరీష్ రావు గారి వాదన చాలా అసంబద్ధంగా ఉంది. గత సమైక్య రాష్ట్రంలో తెలంగాణ భూముల అమ్మకాలు, దోపిడీకి వ్యతిరేకంగానే మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుపెట్టుకోవాలి. మరి, ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పిన ఇప్పటి తెలంగాణలో ఈ భూముల అమ్మకాలు, వేలాలు ఏంది? అప్పుల పాలు చేసినం మన తెలంగాణ రాష్ట్రాన్ని… అని మీ సీఎం గారు ఒప్పుకుని ఇందుకు క్షమాపణ చెప్పి తీరాలి. ఈ విషయమై ప్రజలు ఉద్యమాలకు తప్పక సమాయత్తమవుతారు. ఠికానా లేక భూములమ్మే కాడికి తెచ్చిన మీకు, ఈ కోట్ల విలువైన కార్ల పంపిణీ ఎందుకు? ఉన్న జైళ్ళు కూల్చుడెందుకు? కోట్ల రూపాయల వృధా పబ్లిసిటీ ఖర్చులెందుకు? సెక్రెటేరియట్కే రాని సీఎం గారికి కొత్త భవనాలెందుకు?” అని రాసుకొచ్చారు.
అయితే ఇక్కడ ట్విస్టు ఏమిటంటే, విజయశాంతి టిఆర్ఎస్ పార్టీలో చేరడానికి ముందు తెలంగాణ పేరుతో ఒక పార్టీని ఏర్పాటు చేసి ఆ పార్టీని నడపలేక, ఆ పార్టీ తరఫున ఒక్క వార్డు లోనూ గెలవలేక సతమతమవుతున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీ లోకి విజయశాంతిని తీసుకువచ్చింది హరీష్ రావే. విజయశాంతి టిఆర్ఎస్ పార్టీని విడిచిపెట్టి కాంగ్రెస్ వెళ్ళిపోయిన కొత్తలో ఒక టీవీ ఛానల్ డిబేట్ లో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ స్వయంగా అప్పట్లో ఈ విషయాన్ని తెలిపారు. హరీష్ రావు కారణంగానే విజయశాంతి ని టిఆర్ఎస్ లోకి తీసుకున్నామని ఆయన అన్నారు. ఇక విజయశాంతి కూడా టిఆర్ఎస్ లో ఉన్నంతకాలం కేసీఆర్ కి చెల్లెలిని అంటూ హడావుడి చేశారు. ఇప్పుడేమో హరీష్ రావు కేసీఆర్ ల పై ఆవిడ చెలరేగిపోతున్నారు. మరి హరీష్ రావు విజయశాంతి వ్యాఖ్యలకు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.