కేసీఆర్ ఏకపక్షంగా చేస్తున్న దాడి నుంచి రక్షణకు కావొచ్చు.. టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనే నమ్మకం కావొచ్చు.. లేకపోతే.. సొంత పార్టీ పెట్టి నిలదొక్కుకోలేనన్న భావనతో కావొచ్చు.. ఈటల మాత్రం బీజేపీలోచేరిపోయారు. ఆయనకు తొలి రోజే.. ఆ పార్టీలో ఎలాంటి పరిస్థితి ఉంటుందో తెలిపోయింది. పార్టీలో చేరే కార్యక్రమానికి బీజేపీ అగ్రనేతలు దూరంగా ఉండిపోయారు. ఒడిషాకు చెందిన కేంద్రమంత్రి దేవేంద్ర ప్రధాన్‌తో కండువా కప్పించారు. దీంతో ఈటలతో పాటు చేరడానికి వచ్చిన ఇతర నేతలు చిన్నబుచ్చుకోవాల్సి వచ్చింది. దేవేంద్ర ప్రధాన్‌తో కండువా కప్పించుకోవడానికి ఢిల్లీ పోవాలా అన్న ప్రశ్న సహజంగానే వచ్చింది.
ఇది ఓపెనింగ్ మాత్రమే..ఈటలకు ముందు ముందుచాలా సినిమా కనిపించబోతోందని… తెలంగాణ రాజకీయవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఎందుకంటే..బీజేపీలో చేరేటప్పుడు అందరూ.. ఆయన కన్నా తోపు లేరంటారు. కానీ చివరికి ఆయన బీజేపీకి పనికిరారు అని తేల్చేస్తారు. అక్కడ ఇప్పటి వరకూ జరిగింది అదే. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో నెంబర్ టూగా ఓ వెలుగువెలిగిన నాగం జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరి కనుమరుగయ్యరు. తప్పు తెలుసుకుని బయటకు వచ్చినా… నిలబడలేకపోయారు. ఆయనే కాదు.. గతంలో మంత్రులుగా పనిచేసిన మోత్కుపల్లి, పెద్దిరెడ్డి, విజయరామారావు, ఏ.చంద్రశేఖర్, బోడ జనార్థన్ లాంటి నేతలు ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. వారెవరూతెర ముందు లేరు.
అందుకే ప్రస్తుతం మాజీమంత్రి ఈటలకు లభించబోయే ప్రాధాన్యతపై కమలం పార్టీలో చర్చ నడుస్తోంది. అయితే ఈటలకు ప్రాధాన్యం దక్కేది ఆయన ముందు ముందు బీజేపీని బలోపేతం చేసే అంశంపైనే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. టీఆర్ఎస్ లోని అసంతృప్తులను, ఉద్యమకారులను ఈటల బీజేపీలోకి తీసుకెళ్లాల్సి ఉంది. అలాగే హుజూరాబాద్‌లో గెలిచి తీరాల్సి ఉంది. అక్కడ బీజేపీ బలం నిల్. ఏమైనా బీజేపీకి బలం వచ్చిందంటే అది ఈటల వల్లనే. ఉప ఎన్నికల్లో ఈటల గెలిస్తే బీజేపీలో ఆయన పలుకుబడి మరింత పెరుగుతుంది.. ఓడిపోతే మాత్రం బీజేపీలోనే ఆయనకు ఎదురుగాలి వీడయం ఖాయం.
బీజేపీలో పాతుకుపోయిన నేతల మధ్య వర్గ పోరు ఉంది. వారందరికీ హైకమాండ్ వద్ద పలుకుబడి ఉంది. వారిని కాదని ఈటల తన ప లుకుబడి విస్తరించుకోవాల్సి ఉంది . ఉద్యమకారుడు అయిన ఈటలకు ఇప్పటి వరకూ.. ఎవరి ప్రాపకం కోసం ప్రయత్నించాల్సిన పరిస్థితిరాలేదు. కానీ ఇప్పుడు మాత్రం… ఆయన తన రాజకీయ పంధాను మార్చుకోవాల్సి ఉంది.