బోయపాటి శ్రీను సినిమాల్లో హీరో పాత్రలు ఓ రేంజ్లో ఉంటాయి. హీరోయిజాన్ని ఆయన చూపించినంత మాసీగా ఇంకెవరూ చూపించలేరు. అయితే విలన్ పాత్రలూ… అంతే పవర్ఫుల్ గా ఉంటాయి. `లెజెండ్`తో.. జగపతిబాబు కెరీర్ టర్న్ అయిపోవడానికి, ఆ పాత్రని బోయపాటి తీర్చిదిద్దిన విధానమే కారణం. విలన్ పాత్రలకు కాస్త పేరున్నవాళ్లని ఎంచుకుని, డిఫరెంట్ గా ట్రై చేస్తుంటాడు బోయపాటి. ఇప్పుడూ అదే చేస్తున్నాడు.
బాలయ్యతో బోయపాటి చేస్తున్న సినిమా `అఖండ`. ఇందులో విలన్ల హంగామా ఎక్కువగానే ఉంది. శ్రీకాంత్ కి ఓ కీలకమైన పాత్ర ఇచ్చాడు బోయపాటి. అది విలన్ రోలే అయినా…మెయిన్ విలన్ శ్రీకాంత్ కాదు. ఆ పాత్రకు మరొకర్ని తీసుకోవాలనుకున్నారు. అయితే… కాలక్రమంలో బోయపాటి విజన్ మారింది. శ్రీకాంత్ పాత్రని ఇంకొంచెం బాగా డవలప్ చేసి, ఆ పాత్రనే మెయిన్ విలన్ చేసేశాడట బోయపాటి. ఓ రకంగా.. శ్రీకాంత్ పాత్రకు ప్రమోషన్ ఇచ్చినట్టే. హీరోగా శ్రీకాంత్ కెరీర్‌కి దాదాపు పుల్ స్టాప్ పడిపోయింది. తను క్యారెక్టర్ రేంజ్ కి పడిపోయాడు. ఈ సినిమాతో గనుక.. నిరూపించుకుంటే, శ్రీకాంత్ విలన్ గా కనీసం రెండేళ్లయినా బిజీగా ఉండే అవకాశం ఉంది. `లెజెండ్` బ్రేక్ తో జగపతిబాబు ఇప్పటికీ సినిమాలు చేసుకుంటూనే ఉన్నాడు. అలాంటి బ్రేక్ శ్రీకాంత్ కీ వస్తుందేమో చూడాలి.