వాహన మిత్ర పథకం పేరుతో ఏపీ సర్కార్ మరోసారి ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది. మొత్తంగా రెండు లక్షల నలభై వేల మందికి ఒక్కొక్కరికి పదివేల చొప్పున నగదు బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పదివేలను ఏం చేసుకుంటారంటే… ఇన్సూరెన్స్ ప్రీమియం దగ్గర్నుంచి ట్యాక్సులు అన్నీ కట్టుకోవడానికి ఉపయోగించుకుంటారట..! ఆ పదివేలకు ఇన్సూరెన్స్ ప్రీమియమే కట్టుకోలేరు.. ఆ విషయం పక్కన పెడితే.. అసలు ఈ పథకం లబ్దిదారులు ఇంత తక్కువ ఆన్న చర్చ రావడం ఖాయం. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. సొంత ఆటోలు.. కార్లు .. రవాణా వాహనాలు వంట వాటిని ఆధారంగా చేసుకుని కొన్ని లక్షల మంది ఉపాధి పొందుతూ ఉంటారు.
కానీ .. మొత్తంగా రాష్ట్రం మొత్తం కలిపి అటూ ఇటూగా… రెండున్నర లక్షల మందికే ఇస్తున్నారు. సగటున నియోజకవర్గానికి 1400 మంది లబ్దిదారులు మాత్రమే. అంత తక్కువ మందికి పథకం వర్తింప చేసి.. ఇలా ఫుల్ పేజీ ప్రకటనల పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టడం ఏమిటన్నది ప్రధానంగా అందరిలోనూ వినిపిస్తున్న ప్రశ్న. మేనిఫెస్టోలో…డ్రైవర్లందరికీరూ. పదివేలు ఇస్తామని ప్రకటించారు. కానీ అమల్లోకి వచ్చే సరికి సవాలక్ష నిబంధనలు పెట్టారు. అందులో ప్రధానమైనది.. సొంత వాహనం కలిగి ఉండటం. సొంత వాహనం ఉంటేనే అర్హులు కాదు.., నిరుపేదలై ఉండాలి.
నాలుగు చక్రాల వాహనం ఉంటే పేదల జాబితానుంచి తొలగించేస్తారు. ఈ అడ్డంకులన్నీ తొలగించుకుని.., ఎలాగోలా.. వాలంటీర్లను పట్టుకుని ఎన్రోల్ అవ్వాలి. అంతా చేస్తే.. రూ. పదివేలు ఇస్తారు. చివరికి మొత్తంగా ఇలా అన్ని రకాల అర్హుల్ని తేల్చి.. చివరికి రెండున్నరలక్షల మందికి చేర్చారు. దీంతో… వాహనాల మీద ఆధారపడి అనేక మంది బతుకుతూంటారు. వారికెవరికీ పథకం అందడం లేదు. కంటి తుడుపుగా అతి కొద్ది మందికి సాయం చేసి.. అమలు చేస్తున్నామని చెప్పుకోవడానికే… పథకాన్ని అమలు చేస్తున్నారని.. మీటలు నొక్కుతున్నారన్న విమర్శలు రావడానికి కారణం అవుతోంది.