స్నేహం కోసం సినిమాలో బాబూమోహన్… కొండను మోస్తాననిప్రచారం చేసుకుంటాడు. చూడటానికి అందరూ రావాలని పిలుస్తాడు. నిజమేనని అందరూ వెళ్తారు. తీరా వెళ్లిన తర్వాత.. అందరూ కలిసి కొండను ఎత్తిన తన భుజాలపై పెట్టాలని పిలుపునిస్తాడు.. ఆ వేషాలు చూసి. .ఊరి వాళ్లంతా నాలుగు తగిలిస్తారు. నిజానికి అక్కడ బాబూమోహన్ కొండ ఎత్తలేడని అందరికీ తెలుసు.. అయినా ఏదో మ్యాజిక్ చేస్తారని నమ్మి అక్కడికి వచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో.. ఏపీ ప్రభుత్వ ముఖ్యల వాదన కూడా అలాగే ఉంది. కేంద్రం మెడలు వంచుతామన్న జగన్మోహన్ రెడ్డి డైలాగ్ పదే పదే ప్రచారంలోకి వస్తూండటంతో… శ్రీశైలంలో దేవుని దర్శనం చేసుకుని శ్రీకాంత్ రెడ్డి స్పందించారు.
అదేమిటంటే… కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ ఎంపీల మద్దతు అవసరం లేదని.. అదే వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి అవసరం అయితే.. అప్పుడు మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని ఆయన లాజిక్ వివరించారు. వైసీపీ ఎంపీల మద్దతుపై ప్రభుత్వం నిలబడి ఉంటే మాత్రం వంచుతారట.. లేకపోతే.. ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలుతారట. చీఫ్ విప్ లాజిక్ చూసి.. అంతా ముక్కున వేలేసుకోవాల్సి వస్తోంది. ప్రత్యేకహోదా ఇవ్వకుండానే… కనీసం అడగకుండానే.. కేంద్రానికి అన్ని అంశాల్లోనూ సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూనే ఉండటం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. నిజానికి బీజేపీకి రాజ్యసభలో సంపూర్ణ మెజార్టీ లేదు. అక్కడ వైసీపీ మద్దతే కీలకం.
అయినప్పటికీ రాష్ట్రం కోసం కనీసం ప్రశ్నించిన పాపాన పోవడం లేదు. లోక్సభ, రాజ్యసభల్లో కలిసి ముఫ్పై మంది ఎంపీలు ఉన్నప్పటికీ.. కనీస బాధ్యత లేకుండా వ్యవహరించడమే కాదు.. ఇతర పార్టీలు బీజేపీపై విమర్శలు చేయడం లేదని.. వింత వాదన వినిపిస్తున్నారు. మొత్తానికి వైసీపీ నేతలు ప్రత్యేకహోదా తేవాలంటే.. తమకు ీసట్లు రావాలి.. ఆ సీట్లు కేంద్రంలో ఎవరికైనా అవసరం ఉండాలి అని అని డిసైడయ్యారు. ఎన్నికల సమయంలో అదే చెప్పాల్సింది కానీ.. మెడలు వంచుతామని గంభీరమైన ప్రకటనలు చేసి..ఇప్పుడు.. వారి ఎంపీలతో ప్రయోజనం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు.