తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ భూముల్ని పెద్ద ఎత్తున అమ్మడం ద్వారా ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కాలని నిర్ణయించుకున్నారు. అమ్మాల్సిన భూముల లెక్క తీశారు. ఇప్పటికే మొదటి విడత అమ్మకానికి ముహుర్తం కూడా ఖరారైంది. అయితే ప్రభుత్వ నిర్ణయంపై తెలంగాణలో ఒక్క సారిగా గగ్గోలు రేగింది. విపక్ష పార్టీలన్నీ భూముల అమ్మకాలను తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నదే ఆస్తుల పరిరక్షణ కోసం అని .. ఇప్పుడు అవే ఆస్తుల్ని తెగ నమ్ముతామంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటామని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి విధానాన్నే ప్రతిపక్ష పార్టీలు గుర్తు చేస్తున్నాయి.
తెలంగాణ ఉద్యమ సమయంలో .. టీఆర్ఎస్ ఉద్యమానికి ఇంజిన్ ఆయిల్లా పని చేసిన అంశం భూముల అమ్మకం. హైదరాబాద్ చుట్టుపక్కల జరిగిన అభివృద్ధితో విపరీతంగా పెరిగిన భూముల ధరల నేపధ్యంలో… ప్రభుత్వ భూముల్ని అమ్మి అప్పటి ప్రభుత్వాలు సొమ్ము చేసుకున్నాయి. నిజానికి ప్రభుత్వాలు సొమ్ము చేసుకోవడం అక్కడ మ్యాటర్ కాదు.. అమ్మకాల పేరుతో కొంతమంది అస్మదీయులైన వారికి ఆ భూములు కట్టబెట్టారన్న ప్రచారం జరిగింది. ఇది తెలంగాణ ఉద్యమకారులకు మరింత ఆవేశం తెప్పించింది. ఓ సందర్భంలో టీఆర్ఎస్ నేతలు.. భూముల వేలం పాటలను అడ్డుకున్నారు. ఆ స్థాయి నుంచి ఇప్పుడు..కొత్తగా టీఆర్ఎస్సే భూముల్ని టోకుగా అమ్మే పరిస్థితి వచ్చింది.
ఏం చేసైనా తెలంగాణ భూముల్ని అమ్మకుండా అడ్డుకుంటామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ నేతలుకూడా అదే ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. వీరిద్దరికీ టీఆర్ఎస్ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. కాంగ్రెస్ పాలనలో అమ్ముకున్న భూములవివరాలు బయట పెడుతోంది. అదే సమయంలో బీజేపీ తెగనమ్ముతున్న ప్రైవేటు సంస్థల వివరాలను బయట పెట్టి టీఆర్ఎస్ ఎదురుదాడి చేస్తోంది. భూములు అమ్మకుండా హైకోర్టులో పిటిషన్లు వేయడానికి కూడా పార్టీల నేతలు సిద్ధమవుతున్నారు. రానున్న రోజుల్లో భూముల అమ్మకమే పెద్ద రాజకీయ అంశంగా మారే అవకాశం కనిపిస్తోంది.