తెలుగులో ఫ్రాంచైజీ సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. అయినా అలాంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఓంకార్ అయితే.. `రాజుగారి`కి గది`మీద గది కడుతూనే ఉన్నాడు. `రాజుగారి గది` హిట్టవ్వడంతో… 2, 3 కూడా రంగంలోకి దింపాడు. కానీ.. తొలి సినిమా చూపించినంత ఎఫెక్ట్ మిగిలిన రెండు సినిమాల్లోనూ రాలేదు. పార్ట్ 2లో నాగార్జునని తీసుకొచ్చినా, పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. పార్ట్ 3 అయితే తమ్ముడ్ని హీరోగా నిలబెట్టుకునే ప్రయత్నం కనిపించింది. అయితే అది కూడా దారుణంగా బెడసి కొట్టింది. టీవీ షోల ద్వారా సంపాదించిందంతా.. ఈ సినిమాలపైనే ఖర్చు పెట్టేశాడు ఓంకార్. `రాజుగారి గది 3` తరవాత.. మళ్లీ సినిమాలకు దూరమై, టీవీ షోలతో సరిపెట్టుకున్నాడు.
అయితే ఇప్పుడు `రాజుగారి గది 4` కూడా తీస్తానని ప్రకటించాడు. కథ సిద్ధమైందని, తన తమ్ముడే హీరో అని డిక్లేర్ చేశాడు. వరుసగా దెబ్బ మీద దెబ్బ పడుతున్నా ఓంకార్ ఎందుకో రాజుగారి గదినే నమ్ముకున్నాడు. హారర్ కామెడీ సినిమాల కాలం చెల్లిపోయింది. ఓరకంగా.. ఈ జోనర్ లో వచ్చిన సినిమాల్లో హిట్టయిన చివరి సినిమా రాజుగారి గదినే. ఆ తరవాత…. వంద సినిమాలొచ్చినా, అందులో ఒక్కటీ హిట్ అవ్వలేదు. ఓంకార్ కి స్వయంగా రెండు దెబ్బలు తగిలాయి. అయినా అదే జోనర్ నీ, అదే టైటిల్ నీ నమ్ముకుని వస్తున్నాడు. కనీసం టైటిల్ అయినా మార్చడం లేదు. ఏంటో.. ఓంకార్ కి అంత నమ్మకం..??