పవన్ కల్యాణ్‌కు కేంద్రంలో మంత్రి పదవి అని ఢిల్లీ నుంచి బీజేపీ లీకులు ఇస్తూ గిలిగింతలు పెడుతోంది కానీ.. అసలు విషయం మాత్రం అసలు జనసేనను లెక్కలోకి తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలు ప్రెస్మీట్లలో చెప్పుకోవడానికి జనసేనతో పొత్తు అనే పదాన్ని వినియోగిస్తున్నారు కానీ.. వాస్తవంగా చేపట్టాల్సిన కార్యక్రమాల్లో మాత్రం జనసేనను భాగం చేయడం లేదు. వారితో కనీసం సమాచారం పంచుకోవడం లేదు. దీనికి ఉదాహరణ.., తాజాగా ఆస్తి పన్ను పెంపునకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన నిరసన.
ఆదివారం విజయవాడలో ఏపీ బీజేపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించి… జనసేనతో కలిసి పోరాటం చేస్తామని ప్రకటించారు. కానీ అది ప్రకటనకే పరిమితం. జనసేన నేతలకు కనీస సమాచారం పంపలేదు. తమంతటకు తాము ధర్నాలు చేసేశాం అనిపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అన్నవచ్చాడు.. పన్నులు పెంచాడు అంటూ.. రాజమండ్రిలోనే నిరసన వ్యక్తం చేశారు. నేతలున్న చోట.. ఆసక్తి ఉన్న చోట ధర్నాలు చేశారు. బీజేపీ తీరుపై జనసేన నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఉమ్మడి పోరాటాలు నిర్వహించాలని గతంలోనే బీజేపీ, జనసేన నేతలు కలసి ఈ మేరకు నిర్ణయించారు. ఇప్పుడు బీజేపీ నేతలు వాటిని పట్టించుకోవడం లేదు.
బీజేపీ నేతలు ఆహ్వానించకపోవడం తమకే మంచిదని కొంత మంది బీజేపీ నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు. రాష్ట్రంలో పేరుకు మాత్రమే పొత్తులు పెట్టుకుని.. అవసరమైనప్పుడు పవన్ కల్యాణ్ ఇమేజ్ ఉపయోగించుకుంటూ… బండి నడిపించేస్తున్న బీజేపీ… ఢిల్లీ నుంచి మాత్రం.. పవన్ కల్యాణ్‌కు కేంద్రమంత్రి పదవి అంటూ.. మీడియాకు లీకులు ఇస్తోంది. అయితే.. అది సాధ్యం కాదని ఏపీ బీజేపీ నేతలు నమ్ముతున్నారు. అందుకే వారూ పట్టించుకోవడం లేదు.