హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ని కెప్టెన్‌లాగా నడిపించడంలో అజహుద్దీన్ ఫెయిలయ్యాడు. అందరూ కలిసి ఆయనను టీమ్ నుంచే ఎలిమినేట్ చేసేశారు. ఇప్పుడీ వ్యవహారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో సంచలనాత్మకం అవుతోంది. హెచ్‌సీఏలో తొమ్మిది సభ్యులతో అపెక్స్ కౌన్సిల్ ఉంటుంది. ఆ అపెక్స్ కౌన్సిల్ హఠాత్తుగా అజహరుద్దీన్‌ను రాత్రికి రాత్రే హెచ్‌సీఏ పదవి నుంచి తొలగించినట్లుగా ప్రకటించింది. దానికి కొన్ని కారణాలు చెప్పింది.. అందులో అజహర్‌పై ఉన్న కేసులు.. వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం వంటివి ఉన్నాయి. అయితే.. చాలా రోజులుగా… అజహరుద్దీన్‌కు వ్యతిరేకంగా ఓ బలమైన లాబీ.. హెచ్‌సీఏలో పని చేస్తోంది.
వారు ఇటీవలి కాలంలో మరింత బలం పుంజుకుని అపెక్స్ కౌన్సిల్లో మెజార్టీ అయ్యారు. దీంతో అజహర్ పదవి ఊడిపోయింది. ఈ వివాదంపై అజహర్ స్పందించారు.. తనపై అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్‌కు లేదని తేల్చారు. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు చేసే అధికారం అంబుడ్స్‌మెన్‌కు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు. నిజానికి అంబుడ్స్‌మన్‌గా తన ఆత్మీయుడ్ని ఇటీవలే అజహర్ నియమించుకున్నారు. అది కూడా వివాదాస్పమయింది. అయితే అపెక్స్ కౌన్సిల్ కూడా అజహర్‌కు ఘాటుగానే సమాధానం పంపింది. జస్టిస్ లోధా సిఫార్సుల మేరకే అజారుద్దీన్‌ను తొలగించామని.. నేటి నుంచి అజహరుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడు కాదని ప్రకటించారు. హెచ్‌సీఏ భేటీలకు అజహర్ అధ్యక్షుడిగా రాలేరని స్ఫష్టం చేశారు. అయితే అజహర్ మాత్రం మరోసారి ఎన్నికలకు రెడీ అంటున్నారు.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మంచి ర్యాపో మెయిన్ టెయిన్ చేసి.. హెచ్‌సీఏ అధ్యక్ష పదవిని సునాయసంగా గెల్చుకున్న అజహరుద్దీన్.. అందర్నీ కలుపుకుని పోవడంలో విఫలమయ్యారు. కొంత మంది వ్యవహారాలకు పూర్తిగా అడ్డు తొలగడంతో ఆయనకు వ్యతిరేకంగా బలమైన లాబీ బలపడింది. ఇప్పుడు… కేటీఆర్ జోక్యం చేసుకుంటే పరిస్థితి సద్దుమణుగుతుంది లేకపోతే.. అజహర్.. కెప్టెన్ పదవిని కోల్పోయినట్లుగానే భావించవచ్చు.