హుజూరాబాద్ ఉపఎన్నికను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈటల కూడా అంత కంటే ఎక్కువే తీసుకున్నానని చెప్పేందుకు నేరుగా గజ్వేల్‌లోనే చాలెంజ్ చేసినంత పని చేశారు. బీజేపీలో చేరిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నుంచి ఈటల రాజేందర్ తన నియోజకవర్గానికి వెళ్లారు. అడుగడుగునా ఆయనకు ఘనస్వాగతం లభించేలా ప్లాన్ చేసుకున్నారు. హుజూరాబాద్‌కు వెళ్లే దారిలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ ఉంటుంది. గజ్వేల్‌లోనూ భారీగా ఈటల అనుచరులు… బీజేపీ కార్యకర్తలు పోగయ్యేలా చూసుకున్నారు. అక్కడ ప్రసంగించారు కూడా. తన జీవితంలో గజ్వేల్‌లో ఎంతో ప్రాముఖ్యత ఉందని.. అక్కడే తాను తెలంగాణ ఉద్యమంలో చేరినట్లుగా చెప్పుకొచ్చారు.
రెండో దశ ఆత్మగౌరవం పోరాటం ప్రారంభించినట్లుగా సంకేతాలు పంపారు. ఆ తర్వాత సిద్దిపేట, హుస్నాబాద్‌లోనూ బలప్రదర్శన చేశారు. హుజూరాబాద్‌లో అయితే… ఓ రేంజ్‌లో జన సమీకరణ చేశారు. అక్కడ ఈటెల్లాంటి మాటలతో విరుచుకుపడ్డారు. ఆత్మగౌరవ పోరాటానికి హుజురాబాద్ వేదిక అని.. రేపటి నుంచి ఇంటింటికి వెళ్తానని ప్రకటించారు. మంత్రులకు ఆత్మగౌరవం లేదా.. అని ప్రశ్నించారు. తనకు మద్దతిస్తున్నవారిని అధికారులు వేధిస్తున్నారని.. ప్రజల జోలికి వస్తే ఖబర్ధార్ అని హెచ్చరికలు జారీ చేశారు. 2023 ఎన్నికలకు హుజూరాబాద్ ఉపఎన్నిక రిహార్సల్స్ అన్న ఈటల… ఈ ఎన్నిక తర్వాత రాష్ట్రమంతా పర్యటిస్తానన్నారు.
బీజేపీలో చేరిన తర్వాత ఈటల నేరుగా రంగంలోకి దిగినట్లయింది. టీఆర్ఎస్ ఇప్పటికే ప్రతి మండలానికి ముఖ్య నేతల్ని రంగంలోకి దించారు కానీ.. వారి హడావుడి వల్ల.. ఒక్క ఈటల మీదకు ఇంత మందిని పంపుతున్నారా అన్న సానుభూతి .. ఈటలకు ప్లస్‌గా మారే ప్రమాదం కనిపిస్తోందన్న చర్చ జరుగుతోంది. నేరుగా ఈటల సవాల్ చేయడంతో హుజూరాబాద్ బరి.. ఆసక్తికరంగా మారే అవకాశం కనిపిస్తోంది.