ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… నెలకు రూ. ఆరు వేల కోట్ల అప్పులు తెచ్చుకోకపోతే రోజు గడవని పరిస్థితిలో ఉన్నా… పత్రికలకు ఫుల్ పేజీ ప్రజలకు ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు. కోట్లకు కోట్లు.. అస్మదీయ మీడియా ఖాతాకు మళ్లించడానికి సిగ్గుపడటం లేదు. మొన్నటికి రూ. వంద కోట్ల స్కీమ్‌కు మీట నొక్కడానికి కూడా రూ. ఇరవై కోట్ల వరకూ ఖర్చు పెట్టి ప్రకటనలు ఇచ్చే పరిస్థితి నుంచి ఇప్పుడు.. చేసింది చెప్పుకోవడానికి కూడా… అదే స్థాయిలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన దాని ప్రకారం… ఆరు లక్షల ఉద్యోగాల్ని భర్తీ చేసేశారట. అది ఈ రోజు ఫుల్ పేజీ ప్రకటనలో తేల్చేశారు. అందులో…ఎవరెవరికి ఉద్యోగాలిచ్చారో కూడా రాసుకొచ్చారు. అందులో అత్యధికంగా ఉద్యోగాలు కల్పించినది వాలంటీర్లకు. వారే మూడు లక్షల మంది ఉన్నారు. తర్వాత వార్డు సచివాయల ఉద్యోగాలు. అవే లక్షన్నర ఉన్నాయి. ఐదు వేలో..పదివేలో …ఉద్యోగం కాదని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పినా… వాలంటీర్లను ఉద్యోగాల ఖాతాలో వేసుకుని ప్రచారం చేయడం మాత్రం ఆపలేదు. అయితే వాలంటీర్లు, వార్డు సచివాలయాలు కాకుండా… ఇంకా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. అక్కడే చాలా మందికి ఇదెప్పుడు జరిగిందా అన్న సందేహం ప్రారంభమయింది.
ఉద్యోగాల భర్తీలోని వివరాలు చూస్తే.. రవాణా శాఖలో 52వేల రెగ్యులర్ ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా.. ఏడు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని నియమించినట్లుగా చెప్పుకొచ్చింది. ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ రాలేదు.. అన్ని ఉద్యోగాల భర్తీ ఎప్పుడు చేశారబ్బా.. అని ఆలోచిస్తే… కాసేపటికే లైట్ వెలగడం ఖాయం. ఏమిటంటే… వారందరికీ కొత్తగా ఉద్యోగాలివ్వలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపడం ద్వారా… కొత్తగా ఉద్యోగాలిచ్చిన ఖాతాలో రాసేసుకుంది ప్రభుత్వం. నిజానికి కాంట్రాక్ట్ కార్మికుల్ని వేల సంఖ్యలో తొలగించారు. ఒక్క డీఎస్సీ వేయకుండానే ఐదు వేల మందిని పాఠశాలవిద్యలో ఉద్యోగాలిచ్చినట్లుగా చెప్పారు. మిగతా శాఖల్లోనూ వందలోపు ఉద్యోగాలను భర్తీ చేసినట్లుగా ప్రకటించుకున్నారు. వైద్య ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ సిబ్బందిని.. కరోనా కారణంగా నియమించుకున్నారు. తీసేశారు కూడా. జీతాలివ్వలేదని వారు ఆందోళనలు కూడా చేస్తున్నారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన ఖాతాలో రాసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల లెక్క చూసి నిరుద్యోగుల కడుపు మండిపోయే పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు ఎన్ని ఉద్యోగాలిచ్చామో ఎందుకు ఫుల్ పేజీ ప్రకటన చేయాల్సి వచ్చిందంటే… సీఎం ఈ రోజు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తారట. అంటే… ఆరు లక్షలు కాకుండాఇంకా మిగిలిపోయిన ఉద్యోగాలను ఎప్పుడెప్పుడు భర్తీ చేస్తారో చెబుతారట. మేనిఫెస్టోలో ప్రతీ ఏడాది జనవరి ఒకటో తేదీన జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని సీఎం ప్రకటించారు. కానీ ఇంత వరకూ అమలు చేయలేదు. ఇప్పుడే జనవరి ఒకటి వచ్చిందని అనుకున్నారో.. లేక అస్మదీయమీడియాకు అర్జంట్‌గా డబ్బులు అవసరం అయ్యాయేమో కానీ.. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటన ఇచ్చేశారు. కొసమెరుపేమిటంటే.. ఈ జాబ్ క్యాలెండర్లో ఉద్యోగ ప్రకటనలు వచ్చే ఏడాదిలో వస్తాయి.