నిరుద్యోగ యువత భవిష్యత్తు తో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెలగాటం ఆడుతున్నట్లు కనిపిస్తోంది. గ్రూప్ 1 వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. తాజాగా మొన్నటికి మొన్న హైకోర్టు గ్రూప్ 1 ఇంటర్వ్యూలను వాయిదా వేయాలని ఇచ్చిన తీర్పుపై ఏపీపీఎస్సీ డివిజన్ బెంచ్ కు వెళ్లాలని నిర్ణయించుకుంది. మరొకవైపు గ్రూప్ 1 క్వాలిఫైడ్ అభ్యర్థులు, తమ పేర్లు బయటికి ఎలా వచ్చాయంటూ ఏపీపీఎస్సీ ని కలిసి ఇవాళ వినతి పత్రం సమర్పించారు. వివరాల్లోకి వెళితే..
ఏపీపీఎస్సీ అసమర్థత: ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ – మూడు దశల్లోనూ కొనసాగిన వాయిదాల పర్వం:
2018 డిసెంబర్ 31వ తేదీన ఆ నాటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో, ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 148 ఉద్యోగాలు భర్తీ చేయడానికి సంకల్పించింది. 2019 మార్చి లో జరగవలసిన ప్రిలిమ్స్ పరీక్ష రెండు నెలలపాటు వాయిదా పడి మే నెలలో జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ కారణాలవల్ల వాయిదా వేసినట్లు అప్పట్లో ఏపీపీఎస్సీ పేర్కొంది. ఇక అక్టోబర్ లో జరగవలసిన మెయిన్స్ పరీక్షలను, ప్రిలిమ్స్ ఫలితాల విడుదల ఆలస్యం కావడం వల్ల పోస్ట్ పోన్ చేసింది ఏపీపీఎస్సీ. అక్టోబర్ నుండి 2019 డిసెంబర్ కి మెయిన్స్ వాయిదా పడ్డాయి. అయితే ప్రభుత్వ ఆధీనంలో నడిచే కొన్ని స్టడీ సర్కిల్స్ లో బడుగు బలహీన వర్గాల కి చెందిన పేద నిరుద్యోగ విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. కానీ 2019లో వారికి శిక్షణ ఇవ్వడానికి చేయవలసిన ఏర్పాట్లను ప్రభుత్వం ఆలస్యం చేసిన కారణంగా, ఏపీపీఎస్సీ పరీక్షలను 2020 ఫిబ్రవరి కి వాయిదా వేసింది. ఆ తర్వాత మరొక సారి 2020 ఏప్రిల్ కి అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల వాయిదా వేసింది. ఈలోగా కరోనా విపత్తు వచ్చి పడింది. దాంతో పరీక్షలు మళ్ళీ వాయిదా పడ్డాయి. అయితే 2020 ఆగస్టు నాటికి కరోనా వైరస్ విపత్తు తగినట్లు అనిపించడంతో 2020 నవంబర్ లో మెయిన్స్ నిర్వహించడానికి షెడ్యూల్ విడుదల చేసింది ఏపీపీఎస్సీ.
పరీక్షకు సంబంధించిన ” కీ” సరిగా విడుదల చేయలేని అసమర్థత, కోర్టు మొట్టికాయలు:
ఈ అడ్మినిస్ట్రేటివ్ కారణాల వల్ల జరిగిన వాయిదాలు ఒకవైపు ఉంటే, ప్రిలిమ్స్ పరీక్ష కీ లో దొర్లిన తప్పిదాల కారణంగా నష్టపోయిన విద్యార్థులు 2019 నుండి కోర్టులను ఆశ్రయించి పోరాడుతూనే ఉన్నారు. పైగా ప్రశ్న పత్రాన్ని ఇంగ్లీషులో తయారు చేయించి దానిని ఆటోమేటిక్ సాఫ్ట్వేర్ ద్వారా తెలుగులోకి అనువదించడంతో ప్రశ్నాపత్రంలో దాదాపు 50కి పైగా ప్రశ్నల తెలుగు అనువాదంలో తప్పులు దొర్లాయి అని తెలుగు మీడియం విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తప్పులు దొర్లిన ప్రశ్నలను తీసివేసి మళ్లీ ఫలితాలను విడుదల చేసింది ఏపీపీఎస్సీ. అయితే అందులో కూడా కొన్ని ప్రశ్నలని మినహాయించక పోవడంతో విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. కీ విషయంలో మొదటి నుండి తాము చెప్పిందే కరెక్ట్ అన్న ధోరణి ప్రదర్శించిన ఏపీపీఎస్సీ నవంబర్ లో మెయిన్స్ నిర్వహించడానికి అతి కొద్ది రోజుల ముందు కోర్టు ఆదేశాలతో కీ ని సవరించి మరొక 1400 మంది విద్యార్థులకు అదనంగా మెయిన్స్ పరీక్షకు అర్హత కల్పిస్తూ జాబితాను విడుదల చేసింది. వీరికి పరీక్షకు సన్నద్ధం కావడానికి కనీసం 45 రోజుల సమయం ఇవ్వాలన్న నిబంధన ఉండటంతో పరీక్షలను 2020 డిసెంబర్ కి వాయిదా వేసింది.
హైకోర్టు తీర్పుతో వాయిదా పడ్డ ఇంటర్వ్యూలు:
అలా వాయిదా వేసిన పరీక్షల ఫలితాలను 2021 ఏప్రిల్ లో విడుదల చేసింది. జూన్ 17వ తేదీన వీరికి ఇంటర్వ్యూలు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకు న్నప్పటికీ, మెయిన్స్ సమాధాన పత్రాల మూల్యాంకనం లో భారీగా అవకతవకలు జరిగాయంటూ విద్యార్థులు కొన్ని ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు నాలుగు వారాల పాటు ఇంటర్వ్యూ ప్రక్రియను వాయిదా వేయాలని ఆదేశాలు జారీ చేసింది. 2018 డిసెంబర్ లో వచ్చిన నోటిఫికేషన్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ 2021 జూన్ వరకు కూడా తెమలకపోవడం, అడ్మినిస్ట్రేటివ్ కారణాలతో పలుమార్లు పరీక్షను వాయిదా వేయడం, ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఒక కీని సరిగ్గా తయారు చేయలేక పోవడం ఏపీపీఎస్సీ అసమర్థతకు తార్కాణం అని విద్యార్థులు వాపోతున్నారు.
తాజా వివాదం, ఏపీపీఎస్సీ వైయస్సార్పీఎస్సీ గా మారిందన్న నారా లోకేష్:
అయితే అసమర్థత మాత్రమే కాకుండా ఏపీపీఎస్సీ ని అవినీతి కూడా బ్రష్టు పట్టిస్తోంది అంటూ ప్రతిపక్షానికి చెందిన నారా లోకేష్ వ్యాఖ్యానించారు. దీనికి కారణం మెయిన్స్ ఫలితాలు అభ్యర్థులను విస్మయ పరచడమే. మెయిన్స్ పరీక్షలు రాసిన వారి నుండి 300కు పైగా అభ్యర్థులను ఏపీపీఎస్సీ ఇంటర్వ్యూకు క్వాలిఫై చేసింది. అయితే వీరి లో దాదాపు 40 మంది దాకా 2020 నవంబర్ లో చివరి నిమిషంలో మెయిన్స్ పరీక్షకు కోర్టు తీర్పు కారణంగా క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉండడం అనుమానాలకు తావిచ్చింది. దీనికితోడు ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన పలువురు విద్యార్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారని, అన్ని పేపర్ లను అటెంప్ట్ చెయ్యని కొందరు విద్యార్థులు ఇంటర్వ్యూకు అర్హత సాధించారని సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లు మిగిలిన అభ్యర్థులకు విస్మయం కలిగించాయి. పలువురు అభ్యర్థులు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏపీపీఎస్సీ ని వివరాలు కోరారు. వీటికి వచ్చిన సమాధానాల ఆధారంగా ఈసారి ఏపీపీఎస్సీ ప్రైవేటు సంస్థకు ఆన్సర్ పేపర్స్ దిద్దే బాధ్యతను అప్పగించిందని తెలియడం, పైగా వారు రాసిన సమాధాన పత్రాలను యధావిధిగా ఇవ్వడానికి బదులు కరోనా విపత్తు పేరు చెప్పి డిజిటల్ వాల్యుయేషన్ అంటూ తమ సమాధాన పత్రాలను థర్డ్ పార్టీ ద్వారా స్కాన్ చేయించారని విద్యార్థులకు తెలియడం తో వారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు జోక్యం చేసుకుని ఇంటర్వ్యూ ప్రక్రియను నిలిపివేయాల్సి వచ్చింది.
డివిజన్ బెంచ్ కు వెళ్తానంటున్న ఏపీపీఎస్సీ
ఇదిలా కొనసాగుతుండగా ఇప్పుడు ఇంటర్వ్యూకు అర్హత సాధించిన విద్యార్థులు ఇంటర్వ్యూలు జరపాల్సిందే అంటూ ఏపీపీఎస్సీని ఆశ్రయించారు. హైకోర్టు ఇచ్చిన నిర్ణయంపై ఏపీపీఎస్సీ కూడా డివిజన్ బెంచ్ కు వెళ్దామని చెబుతోంది. ఒక్క గ్రూప్ 1 పరీక్ష నిర్వహించడానికి రెండున్నర ఏళ్ల సమయం, పలుమార్లు కోర్టు మొట్టికాయలు తింటున్న ఏపీపీఎస్సీ తీరుపై విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిరుద్యోగ యువత, తమ భవిష్యత్తు తో సర్వీస్ కమిషన్ చలగాటం ఆడుతోందని, యూపీఎస్సీ లాగా అర్హత సాధించలేకపోయిన విద్యార్థుల మార్కులను వెంటనే విడుదల చేయడానికి ఏపీపీఎస్సీకి ఏం అడ్డు వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు.
మొత్తం మీద ఏపీపీఎస్సీ మీద వస్తున్న అవినీతి మరియు అసమర్థత కి సంబంధించిన ఆరోపణల నుండి బయటపడాలంటే ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేయవలసి ఉంది.