తెలంగాణ కాంగ్రెస్‌లో ఉన్నాడో లేడో తెలియని నేత గోనె ప్రకాష్ రావు. వైఎస్ ఉన్నప్పుడు.. ఆయన అనుచరునిగా.. హైకమాండ్ దగ్గర పలుకుబడి ఉన్న మధుయాష్కీని టార్గెట్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. ఆ తర్వాత జగన్‌కు సపోర్ట్ చేసినా.. పెద్దగా ఆదరణ దక్కక సైలెంటయిపోయారు. ఈ మధ్య పచ్చళ్ల వ్యాపారం చేసుకుంటూ టైంపాస్ చేస్తున్నారు. కానీ హఠాత్తుగా తెరపైకి వచ్చారు. ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు… ఆ పార్టీకి వ్యతిరేకంగా మోత్కుపల్లి నర్సింహాలు ఎలా అయితే వివాదాస్పద ప్రకటనలు చేసేవారో ఇప్పుడు ఆ బాధ్యతను ఏపీ అధికార పార్టీ అంటే వైసీపీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసే బాధ్యతను గోనె ప్రకాష్ రావు తీసుకున్నారు.
ధాటిగా మాట్లాడగల నైపుణ్యం ఉన్న గోనె ప్రకాష్ రావు ఇటీవలి కాలంలో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారు. కొన్ని టీవీ చానళ్లతో మాట్లాడారు. ఇప్పుడు హఠాత్తుగా తిరుపతిలో ప్రత్యక్షమై జగన్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలిగా ఉన్న విజయలక్ష్మి..పర్మిల దీక్షకు ఎలా మద్దతిస్తారని… వైఎస్ విజయలక్ష్మికి జగన్ ఎందుకు షోకాజ్ నోటీస్ ఇవ్వలేదని ప్రశ్నించారు. కొన్నాళ్ల క్రితం.. వైఎస్ విజయలక్ష్మి రచయితగా ఓ పుస్తకం విడుదలైంది. ఆ పుస్తకంలో వైఎస్ పాదయాత్రలో జగన్ సంఘీభావంగా ఉన్నారని.. విజయలక్ష్మి రాశారని.. వైఎస్ పాదయాత్రలో జగన్ పాల్గొన్నట్లు నిరూపిస్తే తిరుపతిలో ఉరేసుకుంటానని గోనె ప్రకాష్‌రావు చాలెంజ్ చేశారు.
వైఎస్ఆర్కు.. జగన్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని.. జగన్‌తో ఉన్న తెలంగాణ నేతలను నట్టేట ముంచాడని మండిపడ్డారు. విజయసాయిరెడ్డి, సజ్జలను బ్రోకర్లుగా అభివర్ణించారు. గోనె ప్రకాష్ రావు ఇటీవలి కాలంలో జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూండటంతో కొంత మంది ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. దీనిపైనా ఆయన స్పందించారు. కవ్వింపులకు పాల్పడితే అందరి బండారం బయట పెడుతానని హెచ్చరించారు. ఏ కారణం లేకుండా గోనె ప్రకాష్ రావు.. ఏపీ రాజకీయాల్లోకి వచ్చి… జగన్ కు వ్యతిరేకంగా కామెంట్లు చేయరని.. ఏదో వ్యూహం ఉండే ఉంటుందని.. ఆయన వెనుక ఎవరు ఉన్నారన్న చర్చ జరుగుతోంది.