తెలుగు – తమిళం అనే తేడాల్లేవిప్పుడు. ఆ గీతలన్నీ ఎప్పుడో చెరిగిపోయాయి. తమిళ దర్శకులు తెలుగులో సినిమాలు చేయొచ్చు. తెలుగు హీరోలు తమిళంలో సినిమాల్ని దింపుకోవొచ్చు. అలానే.. తమిళ హీరోలూ ఇక్కడ అడుగు పెట్టొచ్చు. అందుకు `వీసా` ఎప్పుడో వచ్చేసింది. అయితే.. తమిళ హీరోలు ఇప్పుడిప్పుడే వరుసగా దండయాత్రలు మొదలెడుతున్నారు. వరుసగా ఒకరి తరవాత మరొకరు… తెలుగులో తమ అరంగేట్ర చిత్రాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
మార్కెట్ విస్కృతపరచుకోవడం అనేది చాలా కీలకమైన విషయంగా మారింది. పాన్ ఇండియా అనే ట్యాగ్ లైన్ తగిలించుకోవడమే కాదు. అందుకు తగినట్టు దర్శకుల్ని, సాంకేతిక నిపుణుల్ని, ఇతర నటీనటుల్ని ఎంపిక చేసుకోవాల్సిందే. ఓ తమిళ హీరో.. తెలుగు దర్శకుడితో సినిమా ఒప్పుకున్నాడంటే అది కనీసం `ద్విభాషా` చిత్రంగా ముద్ర వేసుకుంటుంది. తెలుగులోనూ మార్కెట్ వస్తుంది. తెలుగు హీరోలు అదే చేస్తున్నారిప్పుడు. ఆ బాటలోనే.. తమిళ స్టార్స్ నడుస్తున్నారు.
ధనుష్ కి తెలుగులో ఓ మాదిరి మార్కెట్ ఉంది. తన సినిమాలు తెలుగులో పెద్దగా క్లిక్ అవ్వలేదు గానీ, ఓపెనింగ్స్ మాత్రం బాగానే వస్తాయి. హిందీలోనూ ఒకట్రెండు సినిమాలు చేశాడు కాబట్టి.. అక్కడి వాళ్లకూ ధనుష్ బాగా తెలుసు. సో.. పాన్ ఇండియా ట్యాగ్ ఈజీగా పడిపోతుంది. తను ఇప్పుడు శేఖర్ కమ్ములతో జోడీ కరట్టాడు. వీరిద్దరి కాంబినేషన్లో సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. తెలుగు, తమిళంతో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని నేరుగా విడుదల చేస్తారు. విజయ్ కి `తుపాకీ`తో తెలుగులో మార్కెట్ మొదలైంది. తన సర్కార్, మాస్టర్ చిత్రాలకు ఇక్కడ మంచి వసూళ్లు వచ్చాయి. అందుకే ఇప్పుడు నేరుగా ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా కోసం విజయ్ కి ఏకంగా 100 కోట్ల పారితోషికం ఇచ్చారన్నది టాక్. ఆ లెక్కన.. ఏ తెలుగు అగ్ర హీరోకీ.. విజయ్ తీసిపోడని, ఆ మాటకొస్తే.. ఓ మెట్టు పైనే ఉంటాడన్న సంకేతాలు పంపినట్టైంది.
సూర్యకి తెలుగులో సినిమా చేయాలని ఎప్పటి నుంచో కోరిక. తమ్ముడు కార్తి సూర్య కంటే ఆలస్యంగా వచ్చినా, తన కంటే ముందు తెలుగులో సినిమా చేసేశాడు. అదే.. `ఊపిరి`. ఆసినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక అన్నయ్య సూర్యనే బాకీ. ఇప్పుడు సూర్య కూడా అతి త్వరలోనే ఆ బాకీ తీర్చుకోబోతున్నాడు. సూర్య కోసం తెలుగులో కథలు సిద్ధం అవుతున్నాయి. బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ సూర్య కోసం కథలు రెడీ చేస్తున్నారని టాలీవుడ్ టాక్. వీరిద్దరిలో ఒక్కరైనా సూర్యతో సినిమా చేయడం మాత్రం ఖాయం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా రాబోతోంది. విజయ్ సేతుపతి ఇప్పటికీ టాలీవుడ్ స్టార్ అయిపోయాడు. `ఉప్పెన`తో తనదైన ముద్ర వేసిన విజయ్ సేతుపతికి తెలుగులో మంచి డిమాండ్ ఏర్పడింది. తను హీరోగా చేయాలే గానీ, కథలు సిద్ధం చేయడానికి బోలెడుమంది దర్శకులు, నిర్మాతలూ రెడీ.
ఓవైపు తమిళ దర్శకులు తెలుగు హీరోల కోసం కథలు సిద్ధం చేస్తుంటే, మరోవైపు ఇక్కడి దర్శకులు తమిళ కథానాయకులతో చేతులు కలపడానికి సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి ఇది మంచి పరిణామమే. ఇటు తెలుగు ప్రేక్షకులకే కాదు, అటు తమిళ తంబీలకూ వైవిధ్యభరితమైన కాంబినేషన్లు చూసే అవకాశం దక్కుతుంది.