తుని ఘటనలపై ప్రతిపక్ష నాయకుడు జగన్ సుదీర్ఘంగా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలను తిప్పికొట్టడం వరకూ ఒకె. కాని ఆ వూపులో కనీస జాగ్రత్త పాటించకుండా దాడి చేశారు. వంగవీటి మోహన రంగా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు, నిందితులు అనేబదులు చంపిన వారు, ముద్దాయిలు అని ఒకటికి రెండు సార్లు మాట్లాడారు. ఈ ఆరోపణలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రి ఉమా మహేశ్వరరావు వెంటనే ఖండించారు. అసలు జగన్ దేవినేని సోదరుల పేర్ల విషయంలో గందరగోళానికి గురైనట్టు కూడా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ఘటనతో సంబంధం లేని విషయాలను ప్రస్తావించడం ఒకటైతే జగన్ మరింత ముందుకు పోయి ఆర్థికాభివృద్ది లెక్కలు వగైరా వల్లించారు. ఇవన్నీ ప్రస్తుతాంశానికి సంబంధం లేనివే. మరో వైపు చంద్రబాబు నాయుడు రెండవ రోజు కూడా సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. అంతసేపు అదే అంశం సాగదీసి చెప్పడం వల్ల కొంత ఆత్మరక్షణలో వున్నారనే భావం కలిగించారు. కాపులను కులంగా ప్రస్తావించి వారిపట్ల గౌరవం అంటూనే దాన్ని వివరించడంలో తడబాటుకు గురైనారు. ఇదంతా కూడా పెద్ద విషయం లేకుండా సాగదీసినందువల్ల జరిగిందే. పట్టిసీమ నుంచి కాల్‌మనీ వరకూ కలగాపులగం చేయడం సరికాదన్న విమర్శల నేపథ్యంలో చంద్రబాబు వాటిని ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే ఆందోళన కారులను పిలిచి చర్చలు జరిపి పరిష్కారానికి కృషి చేస్తామన్న మాట కూడా ముఖ్యమంత్రి నుంచి వచ్చివుంటే బావుండేది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్ని తేడాలున్నా చర్చలు సంప్రదింపులు తప్పని సరి. తాము చర్చలకు పిలిచినా అవతలి వారు రాకపోతే వేరేవిషయం గాని ప్రభుత్వం నుంచి ఆ ప్రతిపాదనలేకపోవడం పొరబాటవుతుంది. రిజర్వేషన్ల కల్పన సులభంగా జరిగిపోయేది కాదనే సంకేతం మాత్రం చంద్రబాబు మాటల్లో వుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిలో ప్రభుత్వ వైఫల్యం, నిర్వాహకుల అజాగ్త్రత్త గురించి ఎత్తిచూపడం బాగానే వుంది. అయితే తాను ఏ ఒక్క వర్గానికో నాయకుడిగా గాక అందరి తరపున పెద్ద మనిషిగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే తన పునాదిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడ్డం కూడా అర్థమవుతూనే వుంది. లేకపోతే ఆఘమేఘాల మీద షూటింగు మానుకుని రావలసిన అవసరం లేదు. రిజర్వేషన్ల కల్పనపై ఆ శలు కల్పించడం వల్లనే వారు అంతమంది వచ్చారని ఆయన స్పష్టంగానే చెప్పారు. అయితే కమిషన్ ఏర్పాటు దాని సిపార్సుల వంటి విషయాల్లో మాత్రం స్పష్టత లేదనిపించారు.