ఇచ్చిన హామీ అమలు చేయకపోతే రాజీనామా చేసి వెళ్లిపోయే ఆదర్శవంతమైన రాజకీయ వ్యవస్థను తీసుకు రావాలనుకుంటున్నానని సీఎం జగన్.. పదే పదే ఎన్నికల ప్రచారం సభల్లో చెప్పారు. అప్పుడు ఆయనలో గొప్ప రాజకీయవేత్తను జనం చూశారు. దానికి ఎన్నికల ఫలితాలే నిదర్శనం. అయితే ఇప్పుడు జగన్ చెప్పిన ఆదర్శవంతమైన రాజకీయ వ్యవస్థను ఆయనే నెలకొల్పే సమయం వచ్చేసింది. హామీలు అమలు చేయనప్పుడు రాజీనామా చేసే గొప్ప వ్యవస్థను తీసుకొచ్చే సమయం వచ్చేసింది. హోదా యోధుడు వెనక్కి తగ్గకుండా.. తను అన్నమాటల్ని ఆచరించాల్సిన సమయం వచ్చేసింది.
హోదా యోధుడవ్వాలంటే .. వంచాలా..? వాళ్లే వంచే వరకూ చూడాలా..?
ప్రతిపక్ష నేతగా ప్రత్యేకహోదా విషయంలో జగన్‌కు ఆయన పార్టీ నేతలు కానీ.. ఆయన స్ట్రాటజిస్టులు కానీ ఇచ్చిన ఎలివేషన్లు అన్నీ ఇన్నీ కావు. ఆయనను హోదా యోధునిగా కీర్తించారు. ఆ ఊపులో ఆయన చాలా చాలా మాటలు అన్నారు. ఎల్లయ్య, పుల్లయ్య ఎవరున్నా మెడలు వంచి ప్రత్యేకహోదా తీసుకొస్తామని ప్రకటించారు. ప్రత్యేక హోదా వస్తే ప్రతీ జిల్లా హైదరాబాదేనన్నారు. ఆదాయపు పన్ను కట్టక్కర్లేదన్నారు. పరిశ్రమల విప్లవం వస్తుందన్నారు. ఇంకా.. ప్రత్యేకహోదా సంజీవనేనని కూడా సర్టిఫికెట్ ఇచ్చారు. మరి ఇప్పుడేం చేస్తున్నారు… హోదా కోసం పోరాడటం పక్కన పెట్టేసి.. హోదా యోధ అవ్వాలంటే… తానే వెళ్లి మెడలు వంచబోనని… వాళ్లే మెడలు వంచుకున్నప్పుడే.. తాను యోధుడ్నవుతానని విధానం మార్చుకున్నట్లుగా ఉంది. హోదా సంగతి పక్కన పెట్టేసి.. మూడు రాజధానులు పెడితేనే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందుతుందని కొత్త కబుర్లు చెబుతూ.. ప్రజల్ని నిట్టనిలువుగా మోసం చేస్తున్న హోదా యోధుడిగా నిలబడాల్సి వస్తోంది.
గతంలో బీజేపీకి మెజార్టీ లేదా..? మరి వీరోచిత ప్రకటనలన్నీ మోసమా..?
బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందని.. అందుకే హోదాను డిమాండ్ చేయలేకపోతున్నామని.. ప్లీజ్ ప్లీజ్ అని అడగడం తప్ప ఏమీ చేయలేమని.. నిస్సహాయంగా నటిస్తూ జగన్మోహన్ రెడ్డి నమ్మిస్తూ… నమ్మి ఓట్లేసిన ప్రజల్ని బకరాలను చేయడానికి ప్రయత్నిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. బీజేపీకి పూర్తి మెజార్టీవుంది. కానీ ఆయన అప్పుడు ఆయనకు ఇలా అనిపించలేదు. ఎంపీలు అందరూ రాజీనామాలు చేస్తే.. కేంద్రం దిగి వస్తుందని సవాల్ చేశారు. అంతే కాదు తనకు ఉన్న ఎంపీలతో రాజీనామాలు కూడా చేయించారు. ఉపఎన్నికలు రాని సమయం చూసి… ఆ ఒప్పందం బీజేపీతో చేసుకునే… ఆ పని చేశారన్న విమర్శలు ఉన్నా సరే.. ఓ ప్రయత్నమైతే చేశారు. అది ప్రజల్లో పలుకుబడి తెచ్చి పెట్టింది. అప్పుడు మెజార్టీ ఉంది.. ఇప్పుడూ మెజార్టీ ఉంది.. కానీ ఎందుకు… కనీసం ప్రశ్నించలేకపోతున్నారు. దేవుడిపై భారం వేస్తున్నారు. గత ప్రభుత్వం చూపిన పోరాటపటిమలో కనీస వంతు కూడా ఎందుకు లేదు..?
బీజేపీకి రాజ్యసభలో పూర్తి మెజార్టీ ఉందా..? ఎందుకీ ఆత్మవంచన..!?
జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి పూర్తి మెజార్టీ ఉందని ఆత్మవంచన చేసుకుంటున్నారు. కేంద్రాన్ని గట్టిగా నిలయదీయలేని తన నిస్సహాయతను.. ప్రజల అమాయకత్వం మీద రుద్దేస్తున్నారు. జగన్ చెబుతున్నట్లుగా… లోక్‌సభలోనే బీజేపీకి పూర్తి మెజార్టీ ఉంది. మరి రాజ్యసభలో ఎక్కడ ఉంది. రాజ్యసభలో వైసీపీ మద్దతిస్తే తప్ప.. కీలకమైన బిల్లులు పాసవ్వలేని పరిస్థితి ఉంది. ఈ విషయం తెలిసి కూడా రాజ్యసభలో అడగకుండానే బీజేపీకి అన్ని విషయాల్లోనూ మద్దతిచ్చారు. ఎన్నార్సీ, వ్యవసాయ చట్టాలకూ మద్దతిచ్చినప్పుడు హోదా షరతు ఎందుకు పెట్టలేదు..? అనే ప్రశ్నలు వచ్చాయి. కానీ జగన్మోహన్ రెడ్డి కానీ..వైసీపీ కానీ.. రాష్ట్రానికి కేంద్రం ఎలాంటి సాయం చేయకపోయినప్పటికీ.. ఎందుకు నోరెత్తి ప్రశ్నించడం లేదు.. రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం పరస్పర సహకారం తీసుకుని రాష్ట్రాన్ని ఎందుకు గాలికి వదిలేశారనేది ఇప్పుడు ప్రజలు వేస్తున్న ప్రశ్న.
రాజీనామా చేసి ఆదర్శ రాజకీయ వ్యవస్థకు ఆద్యుడిగా మారే సమయం వచ్చేసింది..!
ఎన్నికల ప్రచార సమయంలో చెప్పినట్లుగా హామీలు అమలు చేయలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోయే ఆదర్శ రాజకీయ వ్యవస్థను తీసుకొచ్చే సమయం.. అవకాశం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఆయన ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రాజీనామా చేసి.. ప్రత్యేక హోదా విషయంలో నిస్సహాయుడ్నైపోయినందుకు పదవి వదులుకుంటున్నానని ప్రకటిస్తే.. ప్రజలు గొప్ప సంస్కర్తగా చూస్తారు. లేకపోతే… చేసిన మోసాన్ని ప్రజలు వచ్చే ఎన్నికల వరకూ గుర్తు పెట్టుకుంటారు. అప్పుడు వారికే కొత్త రాజకీయ వ్యవస్థను నెలకొల్పే చాన్సిచ్చినట్లవుతుంది.