తెలంగాణ సీఎం కేసీఆర్ కంప్లీట్ అన్లాక్ ప్రకటించేశారు. రేపట్నుంచి తెలంగాణలో కరోనాకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు అవసరం లేదని నిర్ణయించారు. ఈ మేరకు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకూ ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు ఉన్నాయి. ఆ తర్వాత కర్ఫ్యూ అమలవుతోంది. కానీ రేపుట్నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఎప్పట్లాగే అందరూ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. ధియేటర్లు సహా మాల్స్ తో పాటు అన్నీ యుధావిధిగా నడుస్తాయని.. కంప్లీట్ అన్లాక్ ద్వారా అర్థం చేసుకోవచ్చు. వీటిపై ఏమైనా ఆంక్షలు.. ఉంటే.. ప్రత్యేకంగా ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణలో మొదటి నుంచి కరోనా అదుపులోనే ఉంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే… కరోనా కేసులు పెద్దగా నమోదు కాలేదు. అయితే అవి అధికారిక లెక్కలేనని.. అనధికారికంగా సెకండ్ వేవ్ తెలంగాణను షేక్ చేసిందన్న ప్రచారం కూడా ఉంది. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ నివేదించిన దాని ప్రకారం.. తెలంగాణలో కరోనా ప్రభావం దాదాపుగా లేదు. చాలా పరిమితంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ కారణంగా.. ఆంక్షల సడలింపులు ఇవ్వవొచ్చని సిఫార్సు చేశారు. అయితే.. నైట్ కర్ఫ్యూ పెడతారని.. అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం.. నైట్ కర్ఫ్యూ ఉన్నా.. లేకపోయినా ఒకటేనని భావించి… చివరికి అన్లాక్ నిర్ణయం తీసుకున్నారు.
విద్యాపరంగా కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభాన్ని జూలై ఒకటి నుంచి ప్రారంభించనున్నారు. ఆ రోజు నుంచి స్కూళ్లు కూడా తెరుస్తారు. ధర్డ్ వేవ్ గురించి… దేశంలోవిస్తృతమైన చర్చ జరుగుతోంది. పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించుకోవాలన్న సూచనలు నిపుణుల నుంచి వస్తున్నాయి. కేంద్రం కూడా రాష్ట్రాలకు.. ధర్డ్ వేవ్ గురించి ప్రత్యేకంగా సూచనలు చేస్తోంది. జాగ్రత్తగా ఉండాలని చెబుతోంది. రాష్ట్రాలు సడలింపులు ఇస్తూండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ లేఖలు రాసింది. అయితే కేసీఆర్ మాత్రం… తన నిర్ణయం తాను తీసేసుకున్నారు. దేశంలో కంప్లీట్ అన్ లాక్ ప్రకటించిన రాష్ట్రం తెలంగాణనే. ఇతర రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో కేసులు తగ్గిపోయినా.. కొన్ని ఆంక్షలు కొనసాగిస్తున్నారు.