మెగాస్టార్ చిరంజీవి మాజీ మంత్రి రఘువీరా రెడ్డి పై ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా రఘువీరారెడ్డి అనంతపురం జిల్లాలోని నీలకంఠ పురం లో నూతనంగా నిర్మిస్తున్న ఆలయాల ప్రారంభోత్సవానికి కరోనా కారణంగా హాజరు కాలేకపోతున్న చిరంజీవి వీడియో ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు.
చిరంజీవి ఈ వీడియో సందేశంలో మాట్లాడుతూ, “నా రాజకీయ ప్రస్థానం లో నాకు లభించిన గొప్ప స్నేహితులు రఘువీరారెడ్డి . పరిచయం అయిన తక్కువ సమయంలోనే ఆయన నాకు అంత ఆప్తులు కావడానికి కారణం ఆయన ఉన్నత వ్యక్తిత్వం, సామాన్యుల పట్ల ఆయనకు ఉండే ప్రేమ, దానితో పాటు నా పై ఆయన చూపించే వాత్సల్యత. ప్రజా జీవితంలో రఘు వీరారెడ్డి లాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు అని నా స్వానుభవం. నేను నటించిన ఇంద్ర సినిమాలో నా పాత్ర కరువు రాయల సీమకు నీళ్లు ఇవ్వాలని తపన పడితే, నిజ జీవితం లో ఆ కరువు సీమకు నీళ్లు ఇచ్చి రఘువీరా రియల్ హీరో అయ్యారు. దాహం అంటూ అలమటిస్తున్న రాయలసీమకు నీళ్లు ఇవ్వడం ద్వారా తనను నాయకుని చేసిన ప్రజల రుణాన్ని ఆయన తీర్చుకున్నారు. ఆ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను కూడా హాజరు కావడం మహద్భాగ్యం. ప్రస్తుతం మా రాజకీయ స్తబ్దత లో నేను సినిమాలు తీస్తూ సినీ నటుడిగా కాలం వెళ్లదీస్తుంటే, రఘువీరా రైతుగా అవతారమెత్తి , వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక ఆలయాలు పునర్నిర్మించడానికీ, కొత్త ఆలయాలు నిర్మించడానికి పాటుపడుతున్నారు. ఆయన కి ప్రజల సహకారంతో పాటు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా రఘువీరా రెడ్డి చేస్తున్న కార్యక్రమానికి అన్ని వర్గాల ప్రజల నుండి అభినందనలు వస్తున్నాయి.