ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ప్రతీ వారాంతంలో తాను రాసే “కొత్తపలుకు” ఆర్టికల్ లో నేరుగా చెప్పే అంశాలు కొన్ని ఉంటాయి… కానీ పరోక్షంగా ప్రజలకు పంపే సందేశాలు కూడా చాలా ఉంటాయి. ఎక్కువగా తన మాటలను నేరుగా చెప్పే ఆయన ఈ వారం.. పరోక్ష పద్దతిని ఎంచుకున్నట్లుగా కనిపిస్తోంది. జగన్మోహన్ రెడ్డి తీరును నేరుగా విమర్శించినప్పటికీ.. ప్రజలకు మాత్రం ఓ స్పష్టమైన సందేశం పంపారు. పన్నులు బాదినా.. అప్పులు చేసినా… పరిశ్రమల్ని వెళ్లగొట్టినా.. ప్రజలందర్నీ పేదరికంలోకి నెట్టేసినా… వారంతా తన వైపే ఉంటారన్న ఓ భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని .. ప్రజలందర్ని పిచ్చివాళ్లుగా జగన్ భావిస్తున్నారన్న అభిప్రాయాన్ని తన ఆర్టికల్ ద్వారా .. ఆర్కే.. ప్రజల్లోకి పంపే ప్రయత్నం చేశారు.
జగన్మోహన్ రెడ్డి పాలన నిర్ణయాలను ఖండిస్తూ.. ఆర్కే వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”ను రాయడం కొత్త కాదు. ఎప్పుడైనా రాయకపోతే ఆశ్చర్యపోవాలి. ఆయనకు అంతగా పని కల్పిస్తున్నది కూడా జగనే. ఎప్పటికప్పుడు వివాదాస్పద నిర్ణయాలు.. చట్టబద్ధమైన పాలన లేకపోవడం..కోర్టుల్లో చీవాట్లు ఇలా… దేశంలో ఏ ప్రభుత్వమూ చేయనంత వివాదాస్పద పాలన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. మామూలుగా అయితే.. ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తాలి. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఆ వ్యతిరేకను నవరత్నాలు తగ్గిస్తున్నాయన్న అభిప్రాయం ఉంది.ఆర్కే.. తన ఆర్టికల్స్‌లో అదే చెబుతూంటారు. ఈ ఆర్టికల్‌లోనూ అదే చెబుతూంటారు. ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తకుండా… నవరత్నాల పేరుతో తలా పదివేలు పంచిపెట్టి…సంతృప్తి పరుస్తున్నారని.. అది ఎల్లకాలం ఉండదని హెచ్చరిస్తున్నారు.
కేంద్రంలో జగన్మోహన్ రెడ్డికి ఇక నుంచి సపోర్ట్ లభించదన్నట్లుగా ఆర్కే తన ఆర్టికల్‌లో చెప్పుకొచ్చారు..కానీ అలాంటి పరిస్థితి లేదు. ఆర్థిక పరంగా కేంద్రం సపోర్ట్ లేకపోతే.. ఇన్ని ఆప్పులు చేయడానికి అవకాశం ఉండదు. కేంద్రం సంపూర్ణంగా సహకరిస్తోంది. అయితే జరగబోయే పరిణామాలకు తమ బాధ్యత లేదన్నట్లుగా వ్యవహరించడానికి.., తెలియనట్లుగా వ్యవహరిస్తోంది. ఏపీ పంపే తప్పుడు నివేదికల గురించి ఆర్థికశాఖకు.. రిజర్వ్ బ్యాంక్‌కు అవగాహన లేకుండా ఉంటుందా..? ఈ విషయంలోనూ ఆర్కే.. నిజాల్ని తన ఆర్టికల్‌లో అంగీకరించలేకపోయారు.
ఈ సారి ఆర్కే “కొత్తపలుకు”లో కీలక అంశం కూడా ఉంది. అమిత్ షాతో కలిసి సీఎం జగన్ భోజనం చేశారని.. దాన్ని గొప్పగా వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. నిజానికి ఆర్కే మీడియా.. జగన్ ఢిల్లీ వెళ్లినప్పటి నుండి..ఆయనకు అమిత్ షా అపాయింట్మెంట్ లేదని ఒకటే ప్రచారం చేసింది. కానీ..చివరికి జరిగింది వేరే. ఇప్పుడు ఆర్కేనే అమిత్ షా.. జగన్‌కు పిలిచి భోజనం పెట్టారని అంగీకరించారు.