హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో ఇవాళ వాయిదాకు రావాల్సిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గైర్హాజరవటంపై ఏసీబీ కోర్టు మండిపడింది. కొడంగల్‌లోనే ఉండాలని బెయిల్ మంజూరు సందర్భంగా హైకోర్టు సూచించినందువలనే హైదరాబాద్ రాలేకపోతున్నానని రేవంత్ చెప్పిన సాకును ఏసీబీ కోర్టు తోసిపుచ్చింది. ఆగస్టు 3వ తేదీన వాయిదాకు హాజరుకావాలని ఆదేశించింది.
ఓటుకు నోటు కేసు ఇవాళ ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చింది. ఎ2, ఎ3 నిందితులు సెబాస్టియన్, ఉదయసింహ హాజరయ్యారుగానీ రేవంత్ రెడ్డి రాలేదు. హైకోర్టు బెయిల్ ఆర్డర్‌లో హైదరాబాద్ రావొద్దని ఉండటంవల్లే రావటంలేదని అతని న్యాయవాదులు ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. దీనిని ఏసీబీ కోర్టు తప్పబట్టింది. తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టంచేశారు. దీనిపై రేవంత్ హైకోర్టులో అప్పీల్ చేస్తారా, లేదా ఏసీబీ కోర్టుకు హాజరవుతారా అనేది చూడాలి.
మరోవైపు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో వాదనలు ఇవాళ్టితో ముగిశాయి. తీర్పును కోర్టు రేపటికి వాయిదా వేసింది.