జగన్కు వ్యతిరేకంగా ఢిల్లీలో ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి ధర్నా చేయాలన్న ఆలోచనలో తెలంగాణ సీఎం కేసీఆర్ ఉన్నారు. కేబినెట్ భేటీలో ఏపీతో జల వివాదాల గురించి వచ్చినప్పుడు… ఏపీ సీఎంపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. కేబినెట్ భేటీలో జగన్ గురించి కేసీఆర్ ఏమన్నారో వ్యూహాత్మకంగా.. మీడియాకు రిలీజ్ చేశారు. కొన్ని మీడియాలో ప్రముఖంగా వచ్చేలా చేసుకున్నారు. రాయలసీమ ఎత్తిపోతలతోపాటు ఆర్డీఎస్ కాల్వను అక్రమంగా నిర్మిస్తున్నారని ఇటీవల తెలంగాణలో ముఖ్యంగా.. టీఆర్ఎస్ వర్గాలు ఎక్కువగా విమర్శలు చేస్తున్నాయి. వీటిపైనే కేసీఆర్కు కోపం వచ్చింది. అందుకే ఆయన అవసరం అయితే ప్రధానిని కలవడం.. ఢిల్లీలో ధర్నా చేయడం వంటి ఆప్షన్స్ పెట్టుకున్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నిజంగా ఆ ప్రాజెక్టులను ఆపాలంటే… చాలా సులువుగానే నిలిపివేయవచ్చు. రాయలసీమ ఎత్తిపోతలకు ఇంతవరకూ అనుమతి రాలేదు… అయినా నిర్మిస్తున్నారని తెలంగాణ సర్కార్ అంటోంది. సాంకేతికంగా అది సాధ్యం కాదు. నిజానికి ఆ రాయలసీమ ఎత్తిపోతల కాంట్రాక్ట్ పొందింది మేఘా ఇంజినీరింగ్ కంపెనీ. తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత ఇష్టమైన కంపెనీ. తెలంగాణ సాగునీటి బడ్జెట్లో అత్యధిక మొత్తం ఆ కంపెనీకే వెళ్తూంది. తెలంగాణ రాష్ట్ర సమితి కోసం టీవీ9 లాంటి కంపెనీలను కొనుగోలు చేయడంలోనూ చురుగ్గా వ్యవహరించారు. అలాంటి కంపెనీని ఆ ప్రాజెక్ట్ కట్టకుండా కట్టడి చేయడం పెద్ద విషయం కాదు. అలాగే ఆర్డీఎస్ కాల్వ నిర్మాణం కూడా అంతే. కానీ.. ఈ మార్గాలను కేసీఆర్ పట్టించుకోలేదు. రాజకీయంగా రచ్చ చేయడానికే ప్రాథాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసీఆర్ – జగన్ మధ్య రాజకీయంగా సత్సంబంధాలు ఉన్నాయి. ఇటీవల జల వివాదాల విషయంలో మాత్రం వారి మధ్య సఖ్యత పోయిందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అది అలా కన్పించేలా వారికి వారు రాజకీయం చేసుకుంటున్నారన్న సందేహాలు రాజకీయవర్గాల్లో ప్రారంభమవుతున్నాయి. షర్మిల రాజకీయ పార్టీ పెట్టడం… తెలంగాణలో రాజకీయంగా కేసీఆర్ వైపు ఏకపక్షంగా ప్రజల్ని మొగ్గేలా చేసే…అంశం ఏమీ లేకపోవడంతో.. కేసీఆర్ మళ్లీ ఆంధ్రా వ్యూహాన్ని అమలు చేస్తున్నారని అంటున్నారు. ఆంధ్రతో జల వివాదాలు ఉంటేనే.. ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ వస్తుందని.. కేసీఆర్ అంచనా వేస్తున్నారని.. అందుకనే ఇప్పుడు సులువుగా పరిష్కరించగలిగే అంశాలను… ఢిల్లీకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారని అంటున్నారు. మొత్తానికి ఏదైనా .. జగన్ – కేసీఆర్ మధ్య రాజకీయం అంతర్గత స్నేహం మాత్రమే ఉందని.. బయట లేదన్న అభిప్రాయం మాత్రం కల్పించడంలో ఇద్దరు సీఎంలు సక్సెస్ అవుతున్నారు.