చట్టాలను ఉల్లంఘించి మరీ వారికి పదవులు ఇచ్చారని.. ఇప్పుడు వారికి జగన్ .. తమ మార్క్ మోసం రుచి చూపించారని జస్టిస్ కనగరాజ్, సంచైతలపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో జగన్మోహన్ రెడ్డి తనను నమ్మిన వారిని విస్మరించబోరని.. నిరూపించడానికైనా.. వారిద్దరికీ కొత్త పదవులు సృష్టించాలనే నిర్ణయానికి వచ్చారు. జస్టిస్ కనగరాజ్ కోసం కొత్త పదవిని సృష్టిస్తున్నారు. మాజీ న్యాయమూర్తి అయినందుకు జస్టిస్ కనగరాజ్.. ఫిర్యాదుల పరిష్కారం అయితే బాగా చేస్తారని..అందు కోసం.. పోలీస్ శాఖలో ఓ పోస్ట్ సృష్టిస్తున్నారు. దాదాపుగాఆ పని పూర్తయింది. ఆయనను దానికి చైర్మన్గా నియమించి… ఏపీకి వచ్చి పని చేసినా చేయకపోయినా… ఓ నాలుగైదు లక్షల రూపాయల ప్రజాధనాన్ని జీతంగా ఇచ్చేందుకు మాత్రం సిద్ధమవుతున్నారు.
ఇక మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ హోదా కోల్పోయిన సంచైత గజపతిరాజును కూడా జగన్ … అలా వదిలేయరని.. ఆమెకు కూడా ఓ దారి చూపిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ బాధ్యత విజయసాయిరెడ్డి మీద ఉంది. మాన్సాస్ వ్యవహారాన్ని మొత్తం విజయసాయిరెడ్డినే దగ్గరుండి చూసుకున్నారు. సంచైతను తీసుకు వచ్చి మాన్సాస్ ను అప్పగించి… చేయాలనుకున్నదంతా చేశారు. కానీ అనూహ్యంగా.. హైకోర్టు తీర్పు వల్ల అంతా రివర్స్ అయింది. ఇప్పుడు సంచైతను ఇంకా క్రియాశీలకంగా చేయాలని ఆయన భావిస్తున్నారు. బహుశా.. ఆమెకు.. ఇతర పదవుల కన్నా… విజయనగరంలో రాజులకు పోటీగా ఆమెను తెరపైకి తెచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రస్తుతం బీజేపీలో సంచైత ఉన్నారు. ఆమెను వైసీపీలోకి తీసుకు వచ్చి.. విజయనగరం జిల్లాలో అశోక్ గజపతిరాజుకుపోటీగా నిలబెట్టే అంశాన్ని విజయసాయిరెడ్డి సీరియస్గా పరిశీలిస్తున్నారని అంటున్నారు. అయితే….దానికి సంచైత అంగీకరిస్తారా లేదా అన్న సందేహం ఉంది. ఒప్పుకుంటే రాజకీయ జీవితం.. లేకపోతే.. మరో పదవి ఇస్తారని అంటున్నారు. మొత్తానికి వాడుకుని వదిలేశారని… ఎవరి గురించి ప్రచారం జరిగితే వారికి న్యాయం చేయడానికి సీఎం జగన్…శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.