జగన్ ప్రభుత్వం ఆర్భాటంగా విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పై నిరుద్యోగుల నుండి తీవ్ర స్థాయిలో విమర్శలు, అసంతృప్తి రావడంతో ప్రభుత్వం మరో జాబ్ క్యాలెండర్ కోసం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే..
గౌరవ వేతన వాలంటీర్లు, 90% కార్యకర్తలకు ఇచ్చుకున్న సచివాలయ ఉద్యోగాలు తప్ప ఉపాధి కల్పన చేయలేకపోయిన ఏపీ ప్రభుత్వం:
జగన్ 2019 ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్ర సందర్భంగా -“మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఏటా జనవరి లో జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఖాళీగా ఉన్న రెండు లక్షల పై చిలుకు ఉద్యోగాలను భర్తీ చేస్తామని” హామీ ఇచ్చారు. అయితే 2019 మే లో అధికారంలోకి వచ్చినా 2020 జనవరి, 2021 జనవరి లో జాబ్ క్యాలెండర్ విడుదల కాకపోవడంతో నిరుద్యోగుల్లో తీవ్రస్థాయి అసంతృప్తి నెలకొంది. గౌరవ వేతనం ఇచ్చే వాలంటీర్ ఉద్యోగాలు, 90% వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలకు ఇచ్చుకున్న ( వైయస్సార్ సిపి లో నంబర్ 2 నేత విజయసాయిరెడ్డి వ్యాఖ్యల ప్రకారమే) గ్రామ సచివాలయ ఉద్యోగాలు తప్ప నిజమైన నికార్సయిన నోటిఫికేషన్ అంటూ జగన్ ప్రభుత్వంలో వెలువడకపోవడం తో ఆంధ్రప్రదేశ్ యువత లో నిరుత్సాహం నెలకొని ఉంది. పోనీ ప్రైవేటు ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏమైనా ముందడుగు వేసిందా అంటే, విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయిన కారణంగా ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోదగ్గ స్థాయిలో ఐటీ రంగం అన్నదే లేకుండా పోయింది. భారీ ఉద్యోగాలు ఇచ్చే సామర్థ్యం ఉన్న సర్వీసెస్ రంగం ఆంధ్రప్రదేశ్ లో సరిగా రూపుదిద్దు కోకపోవడం తో యువత కి ప్రైవేటు ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ లేకుండా పోయింది.
రఘురామకృష్ణంరాజు లేఖ రాసిన తర్వాతే మొదటి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన జగన్ ప్రభుత్వం
నిరుద్యోగ యువత లో ఈ స్థాయిలో నిరాశ నిస్పృహలు నెలకొన్నప్పటికీ , సంక్షేమ కార్యక్రమాల వల్ల తమ ప్రతిష్ట పెరిగిపోయిందనే భావన లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉండి పోయింది. అయితే ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ హామీ ఇచ్చి మర్చిపోయిన అంశాలను ఒక్కో దానిని తెరపైకి తెస్తూ జగన్ పై లేఖాస్త్రాలు సంధించారు. ప్రతియేటా విడుదల చేస్తానని చెప్పిన జాబ్ క్యాలెండర్ ఏమైందని ప్రశ్నిస్తూ ఆయన రాసిన తర్వాత కొద్ది రోజులకు జగన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు.
మొదటి జాబ్ క్యాలెండర్ పై ఉస్సూరుమన్న నిరుద్యోగ యువత
దీంతో జగన్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేయడమే కాకుండా గత రెండేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించిందని భారీ స్థాయిలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కి ప్రకటనలు జారీ చేసింది. ఈ క్యాలెండర్ పై ఎంతో ఆశలు పెట్టుకున్న యువత క్యాలెండర్ చూసిన తర్వాత ఖంగు తింది. గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 కలిపి 36 ఉద్యోగాలు అన్న వాక్యం చూసిన తర్వాత గత నాలుగేళ్లుగా ఈ ఉద్యోగాల పై ఆశలు పెట్టుకొని కోచింగ్ సెంటర్లు చుట్టూ తిరుగుతూ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థుల కంట రక్త కన్నీరు
కారింది. సుమారు ఐదారు లక్షల మంది సిద్ధమయ్యే ఈ పరీక్షలకు గతంలో ఎప్పుడు ఇంత తక్కువ సంఖ్యలో పోస్టులు పడలేదు అని వారు వాపోయారు. అంత తక్కువ సంఖ్యలో పోస్టులు ఉంటే, బ్యాంకింగ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వంటి ప్రత్యామ్నాయ పరీక్షల వైపు దృష్టిసారించడం మేలనే అభిప్రాయం గత రెండు రోజులుగా, గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువగా ఉండే హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలో బలంగా వినిపిస్తోంది. ఇక డీఎస్సీ మరియు పోలీస్ కానిస్టేబుల్స్ కి సంబంధించిన ఉద్యోగాలు కూడా జగన్ జాబ్ క్యాలెండర్ లో చోటు చేసుకోకపోవడం తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది.
డ్యామేజ్ కంట్రోల్ దారిలో జగన్ ప్రభుత్వం
ఒక వైపు నిరుద్యోగ యువత నుండి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రావడం, మరొక వైపు సోషల్ మీడియాలో జాబ్ క్యాలెండర్ ని ఎద్దేవా చేస్తూ తీవ్రస్థాయిలో మీమ్స్ వెలువడడం , వాటిని వైయస్ఆర్సిపి పార్టీని అభిమానించే నిరుద్యోగ యువత సైతం విపరీతంగా షేర్ చేయడం, వీటన్నింటి దృష్ట్యా ప్రభుత్వ పెద్దలు డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సిందే అన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా పిడిఎఫ్ ఎమ్మెల్సీలు సైతం టీచర్ పోస్టులను పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను కలిపి మరొక జాబ్ క్యాలెండర్ తయారు చేసి విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వానికి లేఖాస్త్రం సంధించారు. ప్రభుత్వం కూడా ఖాళీల వివరాలు అందని శాఖల నుండి వివరాలను తెప్పించుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో వేర్వేరు సమయాల్లో ప్రభుత్వమే చెప్పిన విధంగా 25 వేల ఉపాధ్యాయ పోస్టులు, ఆరువేల పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా దాదాపు మరో రెండు వేల ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి ఏపీపీఎస్సీ వద్ద సమాచారం ఉంది. నిజంగా వీటన్నింటినీ కలిపితే సుమారు 40 వేల దాకా నిజమైన ఉద్యోగాలు (గౌరవ వేతన సేవలు కాకుండా) కల్పించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. జగన్ ప్రభుత్వం , వీటన్నింటి వివరాలు తీసుకుని డ్యామేజ్ కంట్రోల్ అయ్యే విధంగా జాబ్ క్యాలెండర్ సవరించి విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మొత్తం మీద, డబ్బులు పంచడం మినహా గవర్నెన్స్ కి సంబంధించిన ఏ విషయంలో నూ ఒక పనిని కూడా జగన్ ప్రభుత్వం సరిగా చేయలేదని, కోర్టు మొట్టికాయలు వేస్తేనో లేక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తేనో విధి లేని పరిస్థితుల్లో సరిగా చేయడం తప్ప ఒక విజన్ తో గవర్నెన్స్ చేయడం జగన్ కి చేత కావడం లేదనే అభిప్రాయం వినిపిస్తోంది. కానీ రాజకీయాలను పక్కన పెడితే జాబ్ క్యాలెండర్ ని నిజంగా ప్రభుత్వం సవరించి, పాదయాత్రలో హామీ ఇచ్చిన అన్ని ఉద్యోగాలతో విడుదల చేస్తే అది నిరుద్యోగ యువతకు ఊపిరి పోసినట్లే అవుతుంది.