ఆంధ్రప్రదేశ్ మంత్రులు.. మంత్రులు కావాలనుకున్నవారు.. హైకమాండ్ దృష్టిలో పడాలనుకున్న వారంతా.. ఇప్పుడు నోటికి పని చెబుతున్నారు. నారా లోకేష్‌ను ఎంత దారుణంగా తిడితే అన్ని మార్కులొస్తాయన్నట్లుగా చెలరేగిపోతున్నారు. కొంత మంది మరో అడుగు ముందుకేసి.. శాసనమండలి సమావేశాల్లో చూసుకుందామని సవాల్ చేస్తున్నారు. అంటే మండలిలో దాడి చేస్తామని అర్థమన్నమాట. మూడు రోజుల కిందట.. నారా లోకేష్ కర్నూలు జిల్లా పర్యటనలో “వైసీపీ కుక్క” అనే పదం వాడారు. రెండు రోజుల వరకూ వైసీపీ నేతలు మరీ నోరు చేసుకోలేదు. హఠాత్తుగా ఏమయిందో కానీ… శనివారం నుంచి ఒక్క సారిగా విరుచుకుపడటం ప్రారంభించారు. ఎవరో చెప్పినట్లుగా.. భాషా ప్రావీణ్యాన్ని ప్రదర్శించడం ప్రారంభించారు. ముందుగా కొడాలి నాని రాయలేని.. చెప్పలేని భాషలో తిట్లు లంకించుకుంటే.. ఆ తర్వాత ఇతరులు రంగంలోకి దిగారు.
నెల్లూరు జిల్లా నుంచి మంత్రి పదవి రేసులో ఉన్న నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి .. బట్టీపట్టి మరీ వచ్చి బూతులు తిట్టేశారు. అదే జిల్లా నుంచి మంత్రిగా అనిల్ కుమార్ యాదవ్ తాను మాత్రం ఏమైనా తక్కువ తిన్నారా అని… తిట్లు లంకించుకున్నారు. వీరి బూతులు చూసి.. ఎదురుగా ఉన్న వారికి కూడా మతి పోతోంది. అయితే టీడీపీ నేతలు సైలెంట్‌గా ఉంటే ఎట్లా అనుకున్నారేమో కానీ.. ఒక్కొక్కరుగా వారు కూడా ఎదురు గా వచ్చి కౌంటర్ ఇస్తున్నారు. కానీ వారి విమర్శల్లో పస ఉండదు. వైసీపీ నేతల తిట్లతో పోలిస్తే.. వారివి సాదాసీదాగా ఉంటాయి.
అయితే కొంత మంది టీడీపీ కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా వీడియోల్లో బండ బూతులు పోస్ట్ చేస్తున్నారు. లోకేష్‌ను తిడుతున్న వారిని అంత కంటే ఎక్కువగా తిడుతున్నారు. ఇలా రెండు పార్టీల నేతలు.. రాజకీయాల్లో ఓ సరికొత్త ఒరవడి సృష్టిస్తున్నారు. అందరూ అసహ్యించుకునేలా చేస్తున్నారు. లోకేష్.. ఎవరిని కుక్క అని సంబోధించారో కానీ.. వైసీపీ నేతలు మాత్రం జగన్నే అన్నారని చెప్పి మరీ లోకేష్‌ను తిడుతున్నారు. కొసమెరుపేమిటంటే… తిట్లతోనే ఆగిపోవడం లేదు.. శాసనమండలి సమావేశాల్లో సంగతి చూస్తామంటూ హెచ్చరికలు చేస్తున్నారు. కొడతామని నేరుగానే బెదిరిస్తున్నారు.