ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన ప్రారంభించారు. తొలి రోజు సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించారు. కానీ ఈ జిల్లాల పర్యటనలకు ముందు జరిగిన ప్రచారానికి.. నిన్న జరిగిన పర్యటన తీరుకు అసలు పొంతన లేదు. తాను ప్రభుత్వం చేపట్టిన పనుల పురోగతిని చూడటానికి ఆకస్మిక తనికీలు చేస్తానని కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో… కేసీఆర్ ఎక్కడ .. ఏం పరిశీలిస్తారోనని ప్రజలు చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే అసలు పర్యటన మాత్రం నామమాత్రంగా సాగింది. సిద్దిపేట రాగానే.. సమీకృత కార్యాలయాలను ప్రారంభించారు.. ఆ తర్వాత సభను ఉద్దేశించి ప్రసంగించారు.
కామారెడ్డిలోనూ అంతే. ఎక్కడా ఆకస్మిక పర్యటన చేస్తారని కానీ.. చేసేందుకు సిద్ధమవుతారన్న సంకేతం కూడా రాలేదు. దీంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ చెప్పిన దానికి చేసే దానికి పొంతన లేదన్నవిమర్శలు ఇతర పక్షాల నుంచి రావడానికి కారణం అయ్యాయి. అదే సమయంలో… సిద్దిపేటలో గంటన్నర… కామారెడ్డిలో గంటన్నర పాటు ప్రసగించారు. ఆయన టూర్ మొత్తం ఆరేడు గంటలు సాగితే.. అందులో మూడు గంటల పాటు రెండు చోట్ల ప్రసంగాలకే సరిపోయింది. ఎప్పట్లాగే తెలంగాణ ఉద్యమం దగ్గర్నుంచి సమైక్య కష్టాలు.., బంగారు తెలంగాణ దిశగా తాను తీసుకుపోతున్న వైనాన్ని తనదైన చురుక్కులు.. చమక్కులతో సుదీర్ఘంగా అలా చెప్పుకుంటూ పోయారు.
సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు వరాలు ప్రకటించారు. అయితే కేసీఆర్ అలాంటి వరాలు ఎప్పుడూ ప్రకటిస్తూంటారు కాబట్టి.. అలాంటి వరాలేనని అందరూ లైట్ తీసుకున్నారు. కేసీఆర్ సీఎం అయినతర్వాత జిల్లాల పర్యటనలు చాలా స్వల్పంగా జరిగాయి. జిల్లాల పునర్విభజన తర్వాత చాలా జిల్లాల్లో ఆయన పర్యటించనే లేదు. ఎన్నికల ప్రచారసభల కోసం వెళ్లడమే తప్ప… అధికారిక కార్యక్రమాల కోసం వెళ్లలేదు. ఇప్పుడు… అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలు ఒకే చోట ఉండేలా… నిర్మాణాలు కట్టారు కాబట్టి.. వాటిని ప్రారంభించేందుకు జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. కానీ..అందులో ప్రత్యేకత లేకుండా పోయింది.