జనాలు మర్చిపోయి, ఆఖరికి ఆ సినిమా హీరో కూడా వదిలేసిన సినిమా `ఆరడుగులు బుల్లెట్`. గోపీచంద్ – నయనతార జంటగా నటించిన సినిమా ఇది. బి.గోపాల్ దర్శకుడు. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం రావాల్సిన సినిమా ఇది. పలుమార్లు విడుదల తేదీ ప్రకటించారు. మరో గంటలో సినిమా రిలీజ్ అనగా.. ఆగిపోయింది. మళ్లీ ఇప్పటి వరకూ ఆచూకీ లేదు. మధ్యలో ఓసారి `ఓటీటీలో వస్తోందహో` అన్నారు. అదీ అంతే.
ఇప్పుడు బుల్లెట్ మళ్లీ కదిలింది. `త్వరలోనే విడుదల` అంటూ నిర్మాతలు మళ్లీ ఫ్రెష్షుగా ప్రకటించారు. ఈసారి ఏ అవాంతరాలు వస్తాయో తెలీదు గానీ, ఈ సినిమా ప్రకటన మాత్రం అటు గోపీచంద్ కీ, ఇటు మారుతికీ గుబులు పుట్టిస్తోంది. `అరడుగుల బుల్లెట్` ఇప్పటికే… స్టేల్ అయిపోయిన ప్రాజెక్టు. ఇంతకాలానికి విడుదలైనా.. దానిపై ఎలాంటి క్రేజ్ ఉండదని తెలుసు. ఈ ఎఫెక్ట్ కచ్చితంగా `పక్కా కమర్షియల్`పై పడుతుందన్నది మారుతి, గోపీచంద్ ల భయం. నిర్మాతలు కూడా అదే ఆలోచిస్తున్నారు. `ఆరడుగుల బుల్లెట్` విడుదల కాకపోవడం వల్ల కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండదు. కానీ.. విడుదలైతే మాత్రం కచ్చితంగా తదుపరి సినిమాపై ఆ ప్రభావం ఉంటుంది. కాకపోతే.. `అరడుగుల బుల్లెట్`ని అడ్డుకునే హక్కు వీళ్లిద్దరికీ లేదు. మనసులో `మళ్లీ విడుదల ఆగిపోతే బాగుణ్ణు` అనుకుంటే తప్ప. నిర్మాతలు మాత్రం ఎలాగోలా ఈ సినిమాని విడుదల చేసి, ఎంతో కొంత రాబట్టుకుందామనుకుంటున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థిల్లో ఈ సినిమా విడుదలైతే, కనీసం థియేటర్ అద్దెలైనా వస్తాయా, రావా? అన్నది డౌటు. నయనతార పోస్టర్లు చూసి జనాలు వస్తారన్న ఆశ నిర్మాతలకు ఉందేమో. కానీ అవి ఒకప్పటి రోజులు.