చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఆచార్య`. రామ్ చరణ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇందులో నక్సల్ నేపథ్యం కూడా ఉంది. చిరు, చరణ్ `అన్నలు`గా కనిపించబోతున్నారు. అందుకు సంబంధించిన స్టిల్ కూడా బయటకు వచ్చింది. `ఆచార్య`లో ఓ భావోద్వేగ గీతం ఉందని తెలుస్తోంది. అభ్యుదయ భావాలతో సాగే ఆ గీతంలో శ్రీశ్రీ రాసిన పంక్తులు వినిపిస్తాయని సమాచారం. అయితే అది పాటగా వాడుకున్నారా? డైలాగులతో సరిపెడతారా? అనేది తెలియాల్సివుంది.
శ్రీశ్రీ రాసిన `నేను సైతం ప్రపంచాగ్నికి సమిథనొక్కటి ఆహుతిచ్చాను` ని చిరు రెండు సార్లు వాడుకున్నారు. రుద్రవీణలో శ్రీశ్రీ కవిత వినిపిస్తుంది. ఠాగూర్ లో శ్రీశ్రీ కవితతో పాట మొదలెట్టి, సుద్దాల అశోక్ తేజ.. తనదైన శైలిలో ఆ పాటని మార్చుకున్నారు. ఆ పాటకు జాతీయ అవార్డు కూడా దక్కింది. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నమే చేయబోతున్నారని తెలుస్తోంది. పాటలో గానీ, చిరు మాటల్లో గానీ, శ్రీశ్రీ పంక్తులు ఉంటాయి. వాటిని దర్శకుడు ఎలా మలచుకుంటాడన్నది తెలియాల్సివుంది. ఈ చిత్రంలోని `లాహె.. లాహె` గీతం ఇప్పటికే విడుదలైంది. ఆ పాటకు మంచి స్పందన వచ్చింది. త్వరలోనే రెండో పాటని విడుదల చేస్తారు. ఈసారి చరణ్, పూజా హెగ్డేలపై సాగే డ్యూయెట్ బయటకు వచ్చే ఛాన్సుంది.