తెలుగురాష్ట్రాల మధ్య మళ్లీ హఠాత్తుగా జల వివాదం తెరపైకి వచ్చింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులపై కాకుండా.. ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోత, ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణంపై కేసీఆర్ గుస్సా అయ్యారు. అవసరం అయితే కృష్ణా నీరు చుక్క కిందకు వెళ్లకుండా ప్రాజెక్టులు కట్టడం దగ్గర్నుంచి కేంద్రానికి ఫిర్యాదు చేయడం వరకూ చాలా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇదంతా బాగానే ఉందికానీ.. ఇప్పుడే ఎందుకు ఈ వివాదం హైలెట్ అవుతుంది..అదీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలకు ఆత్మీయులైన మీడియాలో మాత్రమే ఎందుకు హైలెట్ అవుతోందనేది కొంత మందికే అర్థమయ్యే విషయం. అదే రాజకీయం.
బేసిన్లు లేవు భేషజాలు లేవని విజయవాడలో జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లి కేసీఆర్ ప్రకటించారు. జల వివాదాలన్ని జగన్తో సామరస్యంగా
పరిష్కరించుకుంటామని ప్రకటించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో రూ. లక్ష కోట్లతో ఉమ్మడి ప్రాజెక్టుకు ప్రణాళిక కూడా వేశారు. అక్రమ ప్రాజెక్టని ఏపీ సర్కార్ వాదిస్తున్న కాళేశ్వరం ప్రారంభోత్సవానికి వెళ్లి ఆతిధ్యం స్వీకరించి వచ్చారు సీఎం జగన్. ఇప్పటికీ రాజకీయంగా రెండు అధికార పార్టీల అధినేతల మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో కేసీఆర్ జల విధానం ఉంటుంది. మహారాష్ట్ర, కర్ణాటకలతో చాలా వరకూ జల వివాదాలు పరిష్కారం అయ్యారు. కానీ ఏపీ విషయంలో మాత్రం ఆ చొరవ ఉండటం లేదు. ఎందుకనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.
ఇచ్చిపుచ్చుకునే దిశలోనే ఏపీలో కూడా కేసీఆర్ వ్యూహం అవలంభిస్తున్నారని కొంత మంది చెబుతున్నారు. అయితే అది రాజకీయపరంగా అంటున్నారు. ప్రస్తుతం హుజూరాబాద్ ఉపఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అక్కడ తెలంగాణ సెంటిమెంట్ కాస్త ఎక్కువే. ఉద్యమకారుడైన ఈటలను ఢీకొట్టాలంటే ఆ మాత్రం పొరుగు రాష్ట్రంతో ఉద్రిక్తతలుఉండాలని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. అందుకే.. రాజకీయంగా రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ పాత ఉద్రిక్త స్థితి తెచ్చే వ్యూహమా పన్నారని అంటున్నారు. నిజానికి ఆర్డీఎస్ కుడికాలువ పనులు కానీ.. రాయలసీమ ఎత్తిపోతల కానీ నిర్మాణం జరగడం లేదు. కానీ చేస్తున్నట్లుగా ఏపీ సర్కార్… తెలగాణ సర్కార్ గేమ్ ఆడుతూ.. ఉభయతారక రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. రాజకీయాలు అంటే అంతే ఉంటాయి మరి..!