ఇటీవలి కాలంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య జరిగే ఎన్నికలను తలపిస్తున్న సంగతి తెలిసిందే. సినీ పరిశ్రమ రెండు ప్యానెల్స్ గా విడిపోయి హోరాహోరీగా పోరాడటం, కొన్నిసార్లు గెలిచిన తర్వాత ఒకే ప్యానెల్ లోని వ్యక్తుల మధ్య కూడా గొడవలు జరగడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారింది. మరి ఈసారి జరగనున్న ఎన్నికలు కూడా ఇదే విధంగా రసవత్తరంగా మారనున్నాయా అన్న చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..
నరేష్ మరియు రాజశేఖర్ ల ప్యానెల్ శివాజీ రాజా ప్యానెల్ పై క్రితం సారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలలో గెలిచిన సంగతి తెలిసిందే. అయితే గెలిచిన తర్వాత కూడా నరేష్ రాజశేఖర్ ల మధ్య కొద్దిపాటి వివాదాలు జరిగిన సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు వారి పదవీకాలం ముగియడంతో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు మళ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే ఈసారి ఎన్నికలలో తాను పోటీ చేయదలుచుకున్నట్లు ప్రకటించారు. పైగా ఇప్పటికే పలు టీవీ ఛానల్స్ లో ఆయన ఇంటర్వ్యూ లు ఇస్తూ, తనకు ఈసారి ఎన్నికలలో మెగాస్టార్ చిరంజీవి బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెబుతూ వస్తున్నారు. పైగా రాజకీయపరంగా బిజెపికి వ్యతిరేక గళం బలంగా వినిపించే ప్రకాష్ రాజ్ కి టిఆర్ఎస్ అండదండలు ఉన్నాయని కూడా వినిపిస్తోంది.
ప్రకాష్ రాజ్ కి వ్యతిరేకంగా శివాజీ రాజా పోటీ చేసే అవకాశం ఉందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. కానీ శివాజీ రాజా క్రితం సారి కూడా పోటీ చేసి ఓడిపోయి ఉన్నారు. ఈ నేపథ్యంలో హఠాత్తుగా హీరో మంచు విష్ణు కూడా ఈ సారి ఎన్నికలలో పోటీ చేయడానికి ఉత్సాహ పడుతున్నాడు అనే వార్తలు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అటు శివాజీరాజా అయినా ఇటు మంచు విష్ణు అయినా రాజకీయపరంగా వైఎస్సార్సీపీకి అనుకూలురు గా పేరు పడ్డ సంగతి తెలిసిందే. కానీ సినిమా కి సంబంధించిన ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రభావం కానీ, వారి ఇన్వాల్వ్మెంట్ కానీ ఏమాత్రం ఉండదని సినీ పెద్దలు చెబుతున్నారు.
ఏది ఏమైనా ప్రత్యర్థి గా శివాజీరాజా ప్యానల్ ఉంటే ప్రకాష్ రాజ్ గెలుపు నల్లేరు మీద నడక అనే అభిప్రాయం వినిపిస్తున్నప్పటికీ ఒకవేళ మంచు విష్ణు బరిలోకి దిగితే మోహన్ బాబు కుటుంబం అండదండల కారణంగా సమీకరణాలు వేగంగా మారిపోయే అవకాశం ఉందని, అది మరొకసారి చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు అన్న విధంగా మారి పోవచ్చునని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు మరొకసారి రసవత్తరంగా మారే అవకాశం ఉందని తెలుస్తోంది.