ఆంధ్రప్రదేశ్ రాజధాని విశాఖపట్నం అంటూ వివాదాస్పద యాంకర్ ప్రదీప్ ఓ టీవీ షోలో చేసిన వ్యాఖ్యలు రాజధానికి భూములిచ్చిన రైతులకు ఆగ్రహం తెప్పించింది. ఓ ఎంటర్టైన్మెంట్ షోలో… ప్రదీప్..విశాఖను ఆంధ్రప్రదేశ్ రాజధానిని రైట్ ఆన్సర్‌గా తేల్చారు. ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వెంటనే… అమరావతి పరిరక్షణ సమితి కార్యకర్తలు.. భూములిచ్చిన రైతులు సోషల్ మీడియాలో విమర్శలు ప్రారంభించారు. ప్రదీప్ గత చరిత్ర అంతా బయటకు తీసి.. తాగి ప్రోగ్రాములు చేస్తే ఇలాగే ఉంటుందని విమర్శలు ప్రారంభించారు.
ప్రదీప్ ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ప్రదీప్ సాయంత్రానికి క్షమాపణలు చెబుతూ వీడియో పెట్టారు. తనకు ఎవరినీ కించ పరిచే ఉద్దేశం లేదని చెప్పుకొచ్చారు. నిజానికి వివాదాలు ప్రదీప్‌కు చాలా కామన్. అమ్మాయిల విషయం దగ్గర్నుంచి డ్రంకెన్ డ్రైవ్ వరకూ.. ఏం చేసినా వివాదాస్పదమే అవుతోంది. ప్రతీ సారి క్షమాపణలు చెప్పడం షరామామూలుగా మారుతోంది. సున్నితమైన విషయాల్లో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే పరిస్థితులు చేయి దాటతాయని కనీస ఆలోచన లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి.
విశాఖను రాజధానిగా ఏపీ ప్రభుత్వమే చెప్పడం లేదు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా చేస్తామని చెబుతోంది. ఈ అంశం కోర్టులో ఉంది. పైగా మార్పు అనేది.. కొన్నివేల మంది రైతులపై తీవ్ర ప్రభావం చూపించే అంశం. వారు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలంటున్నారు. వీరి గురించి కనీసం సానుభూతి లేకపోగా.. వారిని ప్రదీప్ కించ పరిచారు. చివరికి క్షమాపణలు చెప్పారు. కానీ ఆ మచ్చ మాత్రం అలాగే ఉండిపోతుంది.