ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల ఖాతాల్లో నేడు మరోసారి భారీగా నగదు జమ చేయనుంది. చేయూత పథకం కింద ప్రతీ ఏటా రూ. 15వేలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అయితే ఒకఏడాది ఆలస్యం కావడంతో రూ.18750 చొప్పున నాలుగేళ్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గత ఏడాదితొలి విడతగా… ఇరవై లక్షల మంది లబ్దిదారులకు నిధులు ఖాతాలో వేశారు. ఈ ఏడాది ఇరవై ఒక్క లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో 45 నుంచి 60ఏళ్ల మధ్యనున్న పేద వర్గాలకు ఈ పథకం వర్తిస్తుంది.
కేవలం డబ్బులు ఖాతాల్లో వేయడం కాకుండా వాటి ద్వారా ప్రజలు ఉపాధి పెంచుకునే మార్గాలు చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. రూ. 18750తో మహిళలు కిరాణా షాపులతోపాటు గేదెలు, ఆవులు, మేకలు లాంటి జీవనోపాధి మార్గాలను ఏర్పాటు చేసుకునేందుకు సాయం అందిస్తోంది. బ్యాంకుల ద్వారా ముందే రుణాలు తీసుకుంటే… అవి ప్రభుత్వం చెల్లించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. తొలి విడత లబ్దిదారుల్లో 78,000 మంది కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారని.. మరో రెండు లక్షల మంది ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం ప్రారంభించారని ప్రభుత్వం చెబుతోంది.
అవసరాలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉన్నా… హామీల అమలు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కార్పొరేషన్లు ఏర్పాటు చేసి.. రుణాలు తీసుకొచ్చి అయినా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తోంది. ఆ నిధులతో మహిళల బతుకులు బాగు చేసేలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే లబ్దిదారుల ఎంపికలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. తమ పార్టీ వారికే… నగదు బదిలీ చేస్తున్నారని..ఇతరులు ప్రజలు కాదా.. అని ప్రశ్నిస్తున్నారు. ఈ లోపాలు మినహా చేయూత పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా స్వాలంబన సాధించేందుకు ప్రయత్నాలు చేయవచ్చు.