తెలంగాణలో పార్టీ నిర్వీర్యం అయిపోతున్నా.. కాంగ్రెస్ హైకమాండ్ పీసీసీ చీఫ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఇప్పటికే ఏళ్ల తరబడి వాయిదా వేస్తూ వస్తున్నా… చివరికి ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది. పార్టీలో ఉన్న వారు ఉంటారు.. లేని వారు ఉండరు.. ఫటాఫట్ నిర్ణయం తీసుకుని కార్యకర్తల్లో నిస్తేజం తొలగించాలని అనేక విజ్ఞప్తులు వస్తున్నా… కాంగ్రెస్ హైకమాండ్ అసలు స్పందించడం లేదు. సర్వేలు..నివేదికలు.. అభిప్రాయ సేకరణలతో టైం పాస్ చేస్తోంది. కొద్ది రోజులుగా ప్రధాన పోటీదారులైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి ఢిల్లీలోనే మకాం వేసి తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎవరూ వెనక్కి తగ్గడం లేదు. ఎవరికి పీసీసీ ఇచ్చినా మరొకరు పార్టీలోఉండరన్న ప్రచారం జోరుగా సాగుతూండటంతో హైకమాండ్ కూడా నాన్చివేత ధోరణిని అవలంభిస్తోంది.
రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో… మధ్యే మార్గంగా మరో వ్యక్తిని పీసీసీచీఫ్గా నియమించాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరిగింది. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరిగింది. జీవన్ రెడ్డిని పీసీసీ చీఫ్గా ప్రకటించబోతున్నారని చెప్పుకున్నారు.కానీ..ఆయన విముఖతవ్యక్తం చేయడంతో ఆగిపోయింది. ఇప్పుడు మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పేరు ప్రచారంలోకి వచ్చింది. పిట్ట పోరు.. పిట్ట పోరు పిల్లి తీర్చిందన్నట్లుగా… కోమటిరెడ్డి, రేవంత్ మధ్య పంచాయతీ తెగకపోవడంతో మధ్యేమార్గంగా శ్రీథర్ బాబు పేరు తెరపైకితెచ్చారని చెబుతున్నారు.
పదవి చేపట్టడానికి శ్రీధర్ బాబు కూడా ఆసక్తిగా ఉన్నారు. కానీ ఇలాంటి ఫార్ములాల వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఉండదని..పార్టీని ఊపు తెచ్చే నాయకుడు… కేసీఆర్కు ప్రత్యామ్నాయం అని ప్రజలు అనుకునే నాయకుడికి పీసీసీ చీఫ్ పోస్ట్ కట్టబెడితేనే ప్రయోజనం ఉంటుందని.. లేకపోతే.. పార్టీపై ఆశలు వదిలేసుకోవడమేనని దిగువ స్థాయి కార్యకర్తలు నేరుగా ఫీడ్ బ్యాక్ పంపుతున్నారు. మరి నేతల పంచాయతీ తీర్చి… ఇవ్వాలనుకున్న వారికే పదవి ఇస్తుందా లేక.. మధ్యే మార్గంగా కాడి దించేస్తుందా.. అన్నది వేచి చూడాల్సి ఉంది.