ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం టీకాల రికార్డుతో దేశం మొత్తం తమ వైపు చూసిందని ప్రకటించుకుంది. అలా చూసేంతలోనే ఆ రికార్డు చెరిగిపోయింది. సోమవారం మధ్యప్రదేశ్ ప్రభుత్వం… పదిహేను లక్షలకుపైగా టీకాలను ఒకే రోజు తమ ప్రజలకు వేసింది. ఇందు కోసం.. దాదాపుగా తొమ్మిదివేల వ్యాక్సినేషన్ సెంటర్లు పెట్టారు. దీంతో ఒక్క రోజుకే.. ఏపీ రికార్డు చెరిగిపోయింది. అయితే ఏపీ సర్కార్ ఏ మాత్రం నిరాశపడలేదు. ముఖ్యమంత్రి జగన్ స్వయంగా మరో మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్‌కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. పాతిక లక్షలు టీకాలు ఇచ్చినా వేసే సామర్థ్యం ఉందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ సర్కార్ ఇలా టీకాలన్నింటినీ బిగపట్టుకుని ఒకే రోజు వేస్తోందన్న ఆరోపణలు విపక్షాలు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదు. అందుబాటులో వ్యాక్సిన్ డోసులు లక్షల్లో ఉన్నా .. రోజుకు ఉద్దేశ పూర్వకంగా ఇరవై, ముఫ్పై వేల మందికి మాత్రమే వ్యాక్సిన్ వేస్తున్నారని అంటున్నారు. ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అంటున్ారు. రికార్డుల పిచ్చితో కావాలనే టీకాలు నిల్వ ఉంచుకుని రికార్డు కోసం ఆదివారం వేశారని టీడీపీ నేతలంటున్నారు. నిజానికి ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ బాగా వెనుకబడి ఉంది.ఇప్పటికీ ఏపీలో 74.15 శాతం ప్రజలకు తొలి విడత వ్యాక్సిన్ ఇవ్వలేదు. కోవిన్ రికార్డుల ప్రకారం.. మహారాష్ట్ర వ్యాక్సినేషన్లోఅగ్రస్థానంలో ఉంది. ఏపీ కేవలం కోటి 39 లక్షలు మాత్రమే వ్యాక్సిన్లను పంపిణీ చేసి చాలా వెనుకబడి ఉంది.
అయితే ఇప్పుడు రాష్ట్రాలు సొంతంగా వ్యాక్సిన్లను సేకరించుకునే పరిస్థితి లేదు. కేంద్రం ఇచ్చిన వాటిని మాత్రమే వేయాల్సి ఉంటుంది. కేంద్రం రాష్ట్రాల వారీగా తమకు అందిన వాటిని పంచుతోంది.ఇలా వచ్చే నెలలో పాతిక లక్షల టీకాలు ఏపీకి రావొచ్చని అంచనా. వీటిని బిగపట్టుకుని ఒక్కరోజే ఇరవై లక్షలు ఇచ్చి.. మిగతా రోజుల్లో..రోజుకు ఇరవై, ముఫ్పై వేల చొప్పున పంపిణీ చేస్తే.. రికార్డు సొంత మయ్యే చాన్స్ ఉందని లెక్కలేస్తున్నారు. కేంద్రం నుంచి అదనపు టీకా డోసులు వేస్తే…మరింత ఎక్కువ రికార్డు కోసం ప్రయత్నించే అవకాశం ఉంది.