రాజకీయ నేతలు రోజూ ఎంతగా విమర్శించుకుని వివాదపడినా భక్తి విషయాల్లో ఎక్కడ లేనంత దగ్గరగా సంచరిస్తారు. మొన్న చండీయాగం సందర్భంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ దేశంలోని చాలామందిని ఆహ్వానించారు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వచ్చి వెళ్లారు. ఇప్పుడు కేంద్ర మంత్రి ముప్పవరపు వెంకయ్య నాయుడు కుటుంబం వంతు వచ్చింది. హైదరాబాదు ఎన్టీఆర్ స్టేడియంలో గతం నుంచీ వేంకటేశ్వర వైభవం నిర్వహిస్తున్న ఆయన కుమారుడు ముప్పవరపు హర్ష మిత్రబృందం అందరినీ ఆహ్వానించి తిరుపతిలో జరిగే కైంకర్యాలన్నీ ఇక్కడే నిర్వహించే ఏర్పాటు చేసింది. మొదటి రోజు వెంకయ్య నాయుడు కెసిఆర్ పాల్గొనగా మధ్యలో మరికొందరు నేతలు ఆఖరి రోజున మళ్లీ వెంకయ్య చంద్రబాబు నాయుడు విచ్చేస్తున్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల వేడి నుంచి బయిటపడి భక్తి రాజ్యంలో రాజకీయ నేతలు కలుసుకోవడానికి ఇది వేదిక అవుతున్నది. విశాఖలో టి.సుబ్బరామిరెడ్డి మొదటి నుంచి ఈ పంధాను జయప్రదంగా అమలు చేస్తుంటారు. నిజానికి వెంకయ్యనాయుడు వంటి వారి కంటే కెసిఆరే ఈ విషయంలో ముందున్నారు. రాష్ట్రపతి గవర్నర్తో సహా ప్రతివారికి పాదాభివందనం చేయడం, స్వాములను ఎక్కడివారైనా సరే ఆహ్వానించి ప్రణమిల్లడం, గోబ్రాహ్మణేభ్య సుఖినోభవంతు తరహాలో పరవశించడం ఆయనకు ఆమోదం పెంచుతున్నాయని ఆ వర్గాలు అంటున్నాయి. ఏది ఏమైనా భవబంధాలకు భక్తిబంధాలకు పోటీ వుండకూడదనే భావాన్ని మన నాయకులంతా పాటించడం విశేషం.