రాయలసీమ లిఫ్ట్, ఆర్డీఎస్ కుడికాల్వ నిర్మాణం విషయంలో ఏపీ సర్కార్ తీరును విమర్శించడానికి వైసీపీ నేతలు వైఎస్‌ను.. వైఎస్ జగన్‌ను టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతం మొత్తాన్ని కలిపి విమర్శించేందుకు కూడా వెనుకాడటం లేదు. ఇప్పటికే వైఎస్‌ను సైతం రాక్షసుడిగా అభివర్ణిస్తూ మంత్రులు ప్రకటనలు చేసేస్తున్నారు. ఇదంతా రాజకీయం.. ఇప్పుడు ఈ రాజకీయమే .. తెలంగాణలో అడుగుపెట్టి.. రాజన్న రాజ్యం తీసుకు రావాలని ఆశ పడుతున్న షర్మిలకు ఇబ్బందికరంగా మారింది. వచ్చే నెల ఎనిమిదో తేదీన పార్టీ ప్రకటనకు భారీ ఏర్పాట్లు చేసుకుంటున్న దశలో ఒక్క సారిగా వచ్చి పడిన ఈ జల వివాదం… ఆ పార్టీ నేతలుక ఇబ్బందికరంగా మారింది. ఎలా స్పందించాలో తెలియక తటపటాయిస్తున్నారు.
దీనికి కారణం… ఆ అంశం రెండు వైపులా పదునున్న రాజకీయ అంశం కావడమే. తెలంగాణ కోసమే తాను ఉన్నానని… ఏపీనా.. తెలంగాణ ప్రయోజనాలా అన్న ప్రశ్న వస్తే.. తన సమాధానం నిస్సందేహంగా తెలంగాణే అవుతుందని గతంలోనే షర్మిల ప్రకటించారు. ఇక్కడ అలాంటి ప్రకటన చేయవచ్చు. కానీ.. ఈ రెండు అంశాల్లో షర్మిల తెలంగాణ ప్రజలకు అనుకూలంగా మాట్లాడితే తన తండ్రిని తప్పు పట్టినట్లు అవుతుంది. ఎందుకంటే.. అటు పోతిరెడ్డిపాడు విషయంలో కానీ.. ఇటు ఆర్డీఎస్ విషయంలో కానీ వైఎస్‌పైనే ప్రధానంగా టీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఒక వేళ వారి వాదన కరెక్టే అంటే.. వైఎస్‌ను తప్పు పట్టినట్లు అవుతుంది.
కాదు.. ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి వ్యతిరేకంగా మాట్లాడితే… షర్మిల పార్టీ అంతటితో క్లోజ్ అయిపోతుంది. ఆంధ్రా పార్టీ అనే ముద్ర వేసేస్తారు. ఇప్పుడు.. ఈ అంశంపై ఎటూ స్పందించకపోతేనే మంచిదన్న అభిప్రాయానికి షర్మిల పార్టీ వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేస్తున్నా .. సెంటిమెంట్ పెరగకుండా ఉండాలంటే.. సైలెంట్‌గా ఉండటమే మంచిదని అంచనాకు వచ్చారు. షర్మిల పార్టీకి ఇది మొదటి సవాల్. దీన్ని అధిగమించే దాన్ని బట్టి.. రాజకీయంగా ముందుకెళ్తారా.. గట్టి ఎదురుదెబ్బను ప్రారంభంలోనే తింటారా అన్నది తేలిపోతుంది.