జగన్మోహన్ రెడ్డిపై పదకొండు కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవడంపై ఏపీ హైకోర్టు సుమోటోగా విచారణ చేయడం తప్పని ప్రభుత్వ ఏజీ.. నేరుగా హైకోర్టులోనే వాదనలు వినిపించడం సంచలనాత్మకం అయింది. హైకోర్టు తప్పు ఒప్పులను ఏజీ నిర్దేశించేలా వాదనలు వినిపించడం.. న్యాయవర్గాల్లోనూ కలకలం రేపుతోంది. కేసుల ఉపసంహరణ అంశాన్ని హైకోర్టు సుమోటోగా విచారణకు తీసుకోవడంతో ఈ రోజు విచారణ జరిగింది. ప్రభుత్వం తరపున నేరుగా అడ్వకేట్ జనరలే వాదనలు వినిపించారు. అసలు అలా… కేసులు ఉపసంహరించుకోవడం ఎలా కరెక్టో చెప్పడం కన్నా.. అసలు దీన్ని హైకోర్టు సుమోటోగా తీసుకోవడమే తప్పని వాదించడానికే ఏజీ ప్రాధాన్యం ఇచ్చారు. పైగా ఉద్దేశాలు కూడా ఆపాదించారు.
క్రిమినల్ రివిజన్ పిటిషన్ను సుమోటోగా తీసుకోవడం దేశంలోనే మొట్టమొదటిసారి అని.. ఈ విధంగా సుమోటోగా తీసుకోవడం న్యాయవిరుద్ధమని వాదించారు. ఈ కేసులో బాధితులెవరూ నేరుగా ఫిర్యాదు చేయలేదని …ఈ కేసును సుమోటోగా తీసుకుని నోటీసులు ఇచ్చేముందే కేసుకు విచారణ అర్హత ఉందోలేదో కోర్టు నిర్థారించాల్సిందేనన్నారు. అంతే కాదు.. అసలు ఈ విషయం మీడియాకు ఎలా తెలిసిందని ఆయన హైకోర్టు నిజాయితీనే ప్రశ్నించేలా వాదనలు వినిపించారు. హైకోర్టుకు సంబంధించిన పాలనాపరమైన సమాచారం ముందే పత్రికలు, ఛానెళ్లకు ఎలా వెళ్లిందని… ఈ కేసులో నోటీసులు ఇవ్వకముందే..సమాచారం బయటికి వెళ్లిందని అర్థమవుతోందన్నారు.
మీడియాకు ఎలా తెలిసిందో.. తెలిస్తే ఏమవుతుందో ఏజీ చెప్పలేకపోయారు కానీ.. హైకోర్టు పై నిందలు వేయడానికే ఏజీ ప్రయత్నించినట్లుగా న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది. మొత్తానికి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ మారిన తర్వాత కూడా.. న్యాయవ్యవస్థ విషయంలో.. జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీరు మారలేదని చెబుతున్నారు. ఓ ముఖ్యమమంత్రి.. తన అధికారాన్ని దుర్వినియోగం చేసి.. తనపై కేసులను చట్ట విరుద్ధంగా ఎత్తివేసుకుంటే..దానిపై హైకోర్టు విచారణ జరపకూడదనడం.. న్యాయసమ్మతం కాదని వాదించడం అందర్నీ విస్మయానికి గురి చేస్తోంది.