వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సుమోటోగా కేసుల ఉపసంహరణ ఇప్పుడు న్యాయ వర్గాల్లో కూడా విస్తృతమైన చర్చకు కారణం అవుతోంది. గుంటూరు, అనంతపురం జిల్లాల్లో నమోదైన కేసులు కనీసం ఫిర్యాదు దారులకు కూడా తెలియకుండా… వారి అనుమతి లేకుండా.. ప్రభుత్వం ఉపసంహరించుకుంది. అసలు అవేమి కేసులన్న దానిపై ప్రజల్లో కూడా ఆసక్తి ఏర్పడింది. ఆ కేసుల వివరాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. అవన్నీ అత్యంత దారుణమైన హేట్ స్పీచ్ కేసులు.
ఆర్ఆర్ఆర్పై కేసులు.. జగన్ పై కేసులు సేమ్ టు సేమ్..!
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి .. ముఖ్యమంత్రి చంద్రబాబుపై అత్యంత దారుణంగా మాట్లాడేవారు. ఆయన వయసును కూడా గౌరవించకుండా.. ఏక వచన ప్రయోగం చేయడమే కాకుండా.. ఆయనను చంపడం గురించి ఎక్కువగా విమర్శలు చేసేవారు. ఒకసారి ఆయనను కాల్చి చంపినా తప్పు లేదని నేరుగానే అన్నారు. మరోసారి చెప్పులతో కొట్టి చంపినా తప్పులేదన్నారు. జగన్ అలాంటి మాటలు పదే పదే అన్నా… పలువురు ఫిర్యాదు మేరకు కేసులు పెట్టారు కానీ అరెస్టులు చేయలేదు. అలాంటి కేసులు… గుంటూరు, అనంతపురం జిల్లాల్లో పదకొండు ఉన్నాయి. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు భరోసా యాత్ర అంటూ రాష్ట్రం అంతా పర్యటించిన జగన్.. పలు చోట్ల.. చంద్రబాబును చంపడం.. చెప్పులు, రాళ్లతో కొట్టడం వంటి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ఆయన హద్దులు దాటిపోయారని.. అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఆ కేసులు విచారణ దశలో ఉన్నాయి. వాటన్నింటినీ ఫిర్యాదుదారు అనుమతి లేకుండా.. ప్రభుత్వం.. సొంతంగా ఉపసంహరించుకుంది. ఇదే హైకోర్టు సుమోటోగా తీసుకోవడానికి కారణం అయింది.
జగన్పై ఏకపక్షంగా ఎత్తివేత.. ఆర్ఆర్ఆర్పై “అధికార”ప్రయోగం…!
జగన్పై ప్రభుత్వం ఉపసంహరించుకున్న కేసుల వివరాలు చూస్తే.. ముందుగా.. మనకు ఎంపీ రఘురామకృష్ణరాజు గుర్తుకు వస్తారు..ఆ తర్వాత జడ్జి రామకృష్ణ గుర్తుకు వస్తారు. ఎందుకంటే… వీరిద్దరూ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారని పోలీసులు ఏకంగా రాజద్రోహం కేసులు పెట్టారు. అరెస్ట్ చేశారు. ఎంపీపై ధర్డ్ డిగ్రి ప్రయోగించినట్లుగా ఆరోపణలు కూడా సీఐడీ పోలీసులపై వచ్చాయి. కానీ సేమ్ టు సేమ్ కేసుల్లో చట్టం ఇక్కడ మారిపోయింది. ప్రభుత్వానికి అనుకూలంగా ఓ వైపు పూర్తిగా వాలిపోయింది… మరో వైపు ప్రత్యర్థుల్ని వేటాడటానికి అదే అస్త్రంగా వాడుకున్నారు.
జగన్కు ఓ చట్టం… ఇతరులకు మరో చట్టమా..!?
ప్రత్యర్థులపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో కేసులు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకున్న తర్వాతనే సీఎం జగన్పై అలాంటి అభియోగాలతో ఉన్న కేసులను ప్రభుత్వం హడావుడిగా .. న్యాయ విరుద్ధంగా ..కనీస ప్రక్రియ కూడా చేపట్టకుండా ఉపసంహరించుకుదన్న అనుమానాలు రాజకీయవర్గాల్లో వస్తున్నాయి. నర్సాపురం ఎంపీపైన…ఇతరులపై అలాంటి కేసులు పెట్టినప్పుడు.. ఖచ్చితంగా గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఇతరులు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతాయి. అలాంటి సందర్భాల్లో వారిపై నమోదైన కేసుల్లోనూ ఇలాంటి యాక్షనే తీసుకోవాలని ఎవరైనా కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అలా అశ్రయిస్తే.. కోర్టు … అందరికీ చట్టం ఒకే రకంగా వర్తింప చేయాలని పోలీసులను ఆదేశించడం సహజం. అలాంటప్పుడు జగన్ చిక్కుల్లో పడతారు.
ఆ కేసులు హైకోర్టు పునరుద్ధరిస్తే సీఎంకు తలనొప్పులే..!
అందుకే… ముందుగా జగన్పై … కేసులను ఉపసంహరించుకుని ఆ తర్వాత ప్రత్యర్థుల్ని వేటాడటం ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం చాలా స్పష్టంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా న్యాయనిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఇప్పుడు ఆ కేసులు హైకోర్టు పునరుద్ధరిస్తే.. జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడతారని అంటున్నారు.