తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ వ్యూహాలు ఎవరూ అంచనా వేయలేరు. ప్రగతి భవన్ గేటు దాటని ఆయన ఇప్పుడు.. జిల్లాల బాట పట్టడంతో అందరూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. ఆయన క్యాంప్ నుంచి కొన్ని మీడియా వర్గాలకు కొన్ని లీకులు అందాయి. దాని ప్రకారం..కేసీఆర్‌కు మళ్లీ ముందస్తు ఎన్నికలకు వెళ్లే వ్యూహం ఉందని.. అందుకే.. రంగంలోకి దిగారన్న అభిప్రాయం ప్రజల్లోకి వెళ్లేలా ప్రచారం చేయాలని సంకేతాలు పంపారు. ఆ ప్రకారం కొన్ని మీడియా సంస్థలు… కేసీఆర్ మళ్లీ ముందస్తుకు వెళ్లబోతున్నారా.. అంటూ ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి.
కేసీఆర్ లక్ష్యం.. కేటీఆర్‌ను సీఎం చేసి.. తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం. అందు కోంస తాను భిన్న రాజకీయ వ్యూహాలతో వ్యవహరిస్తూ వస్తున్నారు. ఓ సారి బీజేపీతో పోరు అంటారు..మరోసారి రాజీ లేదు.. సమరం లేదు అంటారు. ఇప్పటికైతే తటస్థ పద్దతిలోనే ఉన్నారు. అయితే… బీజేపీ ఏ చిన్న చాన్స్ వచ్చినా.. తమను వదలదని ఆయనకు తెలుసు. ఎన్నికల్లో గెలుపు కోసం టైమింగ్ కూడా ముఖ్యమని నమ్ముతారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రధాన ప్రచారాస్త్రం అయినప్పుడు తెలంగాణలో బీజేపకి మంచి ఫలితాలొచ్చాయి. ఆ విషయం కేసీఆర్ గుర్తించే… గతంలో ఆరు నెలలు ముందస్తు ఎన్నికలకు వెళ్లారు మంచిఫలితాలు సాధించారు. కానీ పార్లమెంట్ ఎన్నికలొచ్చేసరికి ఎదురుదెబ్బ తిన్నారు. అందుకే మరోసారి ముందస్తు ఎన్నికలపై కేసీఆర్ నజర్ పెట్టారని అంటున్నారు.
2023లో ద్వితీయార్థంలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. గట్టిగా రెండేళ్లు మాత్రమే ఉన్నాయి. కానీ మరోసారి ముందస్తుకు వెళ్లి … విపక్షాలు బలపడకముందే.. మరో ఐదేళ్లు టర్మ్ పెంచుకుంటే… ఆ తర్వాత ఎదురు ఉండదన్న ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ప్రజాభిప్రాయం తెలుసుకోవడానికి ప్రజల్లో బంగారు తెలంగాణ వైపు తీసుకెళ్తున్నామన్న భావనకల్పించడానికి ఆయన జిల్లాల పర్యటన ప్రారంభించారని.. అంతా బాగుందని అనుకుంటే మళ్లీ ముందస్తు నిర్ణయం ఖాయమని అంటున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. కేసీఆర్ మనసులో నిజంగా అలాంటి ఆలోచన ఉంటే.. ఆయన వాటితో పాటుఎన్నికలకు వెళ్లొచ్చు..లేదా.. విడిగా అయినా ఎన్నికలకు వెళ్లొచ్చని అంటున్నారు. అయితే ఇవన్నీ ప్రజల్లో చర్చ కోసం కేసీఆర్ వ్యూహాత్మకంగా ఇచ్చే లీకులు అనిచెప్పేవారు కూడా ఉన్నారు..!